Local Body Elections: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికల నగారా మోగనుంది. జూలై నెలలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు జూన్ చివరి వారం నాటికి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఆగస్టు రెండో వారం వరకు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలన్నది ప్రభుత్వ యోచన.
ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులకు ఇప్పటికే ఆదేశించినట్టు తెలుస్తోంది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి పనులు దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. అయితే, ఇవన్నింటినీ మరోసారి ఉన్నతాధికారులు సమీక్షించే అవకాశం ఉంది.
గ్రామ పంచాయతీలకే తొలి ప్రాధాన్యత
ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,633 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో సుమారు 1,13,500 పైగా వార్డులు ఉండగా, కొన్ని గ్రామ పంచాయతీలు మునిసిపాలిటీలలో విలీనమయ్యే అవకాశమూ ఉంది. అటువంటి చోట్ల వార్డులకు ఎన్నికలు జరగకపోయినా, మిగతా పంచాయతీలకు మాత్రం ఎన్నికలు జరగనున్నాయి.
ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు
ఈ క్రమంలో 5,817 ఎంపీటీసీ, 567 ఎంపీపీ, 567 జడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీటీసీ ఎన్నికల అనంతరం, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలను మినహాయించి మిగిలిన 31 జిల్లాల్లో జడ్పీ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆగస్టు లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై తేలేదెప్పుడు..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ, కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
కేంద్రం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడానికి కారణం… ఒకసారి తెలంగాణలో బీసీ రిజర్వేషన్‌ను ఆమోదిస్తే, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అలాంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని భావించడం. అందుకే ఇది ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని సమాచారం.
పాత రిజర్వేషన్లే కొనసాగవచ్చా?
జూలైలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా కేంద్రం తేల్చకపోతే, ప్రభుత్వం పాత రిజర్వేషన్ విధానంతోనే ఎన్నికలు జరపాల్సి వస్తుంది. ఆ విధంగా చూస్తే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించి, మిగతా భాగాన్ని బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది.
గత ఎన్నికల్లో ఈ లెక్కన బీసీలకు:
- గ్రామ పంచాయతీల్లో 21–22 శాతం,
- మున్సిపాలిటీల్లో 31 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అదే పద్ధతిని కొనసాగించాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుగానే హామీగా ఇచ్చిన నేపథ్యంలో, పార్టీ పరంగా అయినా ఆ హామీని నెరవేర్చాలన్న ఒత్తిడి ప్రభుత్వం మీద పెరుగుతోంది. బీసీ నేతలు ఇప్పటికే ఆ దిశగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అందువల్ల పార్టీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
పార్టీ పదవుల పంపిణీపై సీఎం దృష్టి
ఇక మరోవైపు, పార్టీలో నాయకులకు పదవులు కేటాయించే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని గ్రామస్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లేందుకు, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ పదవులను భర్తీ చేయాలని యోచిస్తున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితర నేతలందరికీ క్షేత్రస్థాయిలో పని చేయాలని సీఎం ఇప్పటికే సూచనలు ఇచ్చారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుందన్నది కాంగ్రెస్ పార్టీ లెక్కింపు.
స్థానిక ఎన్నికల్లో విజయంపై ఆశలు
ఇటీవలి రాష్ట్ర రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్న భావనతో, పార్టీ ఈసారి స్థానిక సంస్థలలో విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని అదును చేసుకుంటూ బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని సానుకూలంగా మలిచేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.