Telangana BJP : తెలంగాణ బీజేపీ ప్ర‌క్షాళ‌న‌?

ప్ర‌స్తుతం ఉన్న బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు టార్గెట్ చేశారంటే ల‌క్ష్యాన్ని ముద్దాడాల్సిందే. ఆ రేంజ్ లో వ్యూహాల‌ను ర‌చిస్తారు.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 01:00 PM IST

ప్ర‌స్తుతం ఉన్న బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు టార్గెట్ చేశారంటే ల‌క్ష్యాన్ని ముద్దాడాల్సిందే. ఆ రేంజ్ లో వ్యూహాల‌ను ర‌చిస్తారు. ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని వాళ్ల ఎత్తుగ‌డ‌. అందుకోసం కేసీఆర్ వేసే అడుగుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెడుతూ నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేసే ప‌నిలో ఉన్నారు. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల బీజేపీ కార్పొరేట‌ర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీను ఢిల్లీకి పిలిపించుకున్నారు. తెలంగాణ వ‌చ్చిన ప్ర‌తిసారీ పార్టీ లీడ‌ర్ల‌తో భేటీ అవుతున్నారు. అస‌ర‌మైతే, నాయ‌కత్వాన్ని మార్పు చేయ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజ‌య్ అందర్నీ క‌లుపుకుని పోలేక‌పోతున్నారు. ఆయ‌న మీద కొంద‌రు ఫిర్యాదులు కూడా చేశారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన కొంద‌రు ఆయ‌నకు వ్య‌తిరేకంగా గ్రూప్ క‌ట్టారు. ఎప్ప‌టిక‌ప్పుడు ర‌హ‌స్య స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తూ సంజ‌య్ కు మ‌న‌శ్శాంతిలేకుండా చేస్తున్నారు. వాళ్ల‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వ‌చ్చిన ఓ సీనియ‌ర్ లీడ‌ర్ రూట్ మ్యాప్ ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌చేస్తున్న‌ట్టు వినికిడి. అంతేకాదు, బీజేపీలో తొలి నుంచి ఉంటూ కీల‌క ప‌దవుల‌ను నిర్వ‌హించిన మ‌రో నేత కూడా వ్య‌తిరేక గ్రూప్ కు అండ‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. అందుకే, హైద‌రాబాద్ లో ప‌లుమార్లు వ్య‌తిరేక గ్రూప్ ర‌హ‌స్య స‌మావేశాల‌ను ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షునిగా బండి సంజ‌య్ వ‌ద్దంటూ మీడియాకు కూడా ఎక్కారు. ఢిల్లీ వ‌ర‌కు వెళ్లి ఆయ‌న‌పై అసంతృప్తిని వ్యక్త‌ప‌రిచారు.

తెలంగాణ కాంగ్రెస్ త‌ర‌హాలోనే గ్రూపు విభేదాలు బీజేపీలో ఉన్న‌ప్ప‌టికీ అంత‌ర్గ‌త క్ర‌మ‌శిక్ష‌ణ కార‌ణంగా బ‌య‌ట‌ప‌డ‌డంలేదు. పైగా గ్రూపుల‌ను బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ప్రోత్స‌హించ‌రు. ఆ విష‌యం తెలుసుకున్న వ్య‌తిరేక గ్రూప్ ప్ర‌స్తుతానికి సిద్దుమ‌ణిగింది. సాధార‌ణంగా ఒక‌సారి అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చిన త‌రువాత బీజేపీ వెంట‌నే మార్చేయడానికి సిద్ద‌ప‌డ‌దు. అవ‌స‌ర‌మైతే, రెండోసారి కూడా అధ్య‌క్ష ప‌ద‌విని కొన‌సాగిస్తోంది. వ్య‌తిరేక గ్రూపులు చేసే ఒత్తిడిని పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. అదే స‌మ‌యంలో ప‌రిస్థితిని మాత్రం క్లోజ్ గా అబ్జ‌ర్వ్ చేస్తుంటుంది. అందుకే, బండి సంజ‌య్ కు తోడు మ‌రొక‌రిని కీల‌కంగా చేయాల‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఈటెల రాజేంద్ర‌ను ఢిల్లీ పిలిపించుకున్న‌ట్టు తెలుస్తోంది.

సౌమ్యుడు, వివాద‌ర‌హితుడు, కేసీఆర్ అనుపానుపులు సంపూర్ణంగా తెలిసిన రాజేంద్ర‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని రంగం సిద్ధం అవుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. జూలైలో జ‌రిగే బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల సంద‌ర్భంగా తెలంగాణ బీజేపీ నాయ‌క‌త్వంలో భారీ మార్పులు ఉంటాయ‌ని స‌మాచారం. అధ్య‌క్ష బాధ్య‌త‌లు బండి సంజ‌య్ వ‌ద్ద ఉంచుతూనే స‌మాంత‌రంగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ లేదా స్టార్ క్యాంపెయిన‌ర్ బాధ్య‌త‌ల‌ను ఈటెల‌కు అప్ప‌గించే యోచ‌న చేస్తున్న‌ట్టు క‌మ‌ల‌నాదుల్లో చ‌ర్చ జరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టార్గెట్ ను ముద్దాడే విధంగా నాయ‌క‌త్వ మార్పులు ఉంటాయ‌ని తెలుస్తోంది. అవి ఏ స్థాయిలో ఉంటాయో చూద్దాం!