Munugode bypoll: ‘మునుగోడు’ ఎన్నిక చాలా రిచ్ గురూ!

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కంటే మునుగోడు ఉప ఎన్నిక ఖరీదైనదిగా మారనుందా? ప్రధాన పార్టీలు తమ అభ్యర్థిని గెలుపొందడం కోసం,

  • Written By:
  • Updated On - October 10, 2022 / 12:00 PM IST

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కంటే మునుగోడు ఉప ఎన్నిక ఖరీదైనదిగా మారనుందా? ప్రధాన పార్టీలు తమ అభ్యర్థిని గెలుపొందడం కోసం, ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా డబ్బును ఆఫర్ చేస్తూ, కిందిస్థాయి నేతలకు కాస్ట్ లీ గిఫ్టులు అందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్నకు ప్రాధాన్యత ఏర్పడింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు భారీ ప్రాధాన్యం ఉన్నందున ఈ ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంతకుముందు, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా పరిగణించబడింది. పార్టీలు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేయడమే కాకుండా ఉప ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. ఈసారి మునుగోడు అసెంబ్లీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి పథకం లేదా పనులను ప్రకటించనప్పటికీ, ఉప ఎన్నిక కోసం రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు.

ఇటు అధికార టీఆర్‌ఎస్‌, అటు బీజేపీ నేతలు ఓటర్ల కోసం నగదు పంపిణీ చేస్తున్నాయని పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఉప ఎన్నిక కోసం 500 కోట్లు ఖర్చు చేసి ఒక్కో ఓటరుకు రూ.30 వేలు పంచాలని బీజేపీ యోచిస్తోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ.. ఒక్కో ఓటరుపై 40 వేల రూపాయలు ఖర్చు చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రణాళికలను రచించిందని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి ఏకంగా టీఆర్ఎస్ నేతలతో మందు పార్టీలు చేసుకుంటున్నాడని, అందుకు సంబంధించిన ఫొటోలను చూపిస్తూ మండిపడుతోంది బీజేపీ.

ఈ సెగ్మెంట్‌లోని దిగువ స్థాయి నేతలకు 200 బ్రెజ్జా కార్లు, 2 వేల బైక్స్ పంపిణీ చేయాలని బీజేపీ ఆదేశించిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. దీనిపై విచారణ చేసేందుకు టీఆర్‌ఎస్‌ బృందాలను ఏర్పాటు చేసిందని, త్వరలో భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హరీశ్‌ తెలిపారు. స్థానిక నేతలకు విమానాలు పంచినా.. మునుగోడు ప్రజలు అభివృద్ధికి సహకరిస్తారని బీజేపీపై దాడి చేశారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. హుజారాబాద్ కంటే మునుగోడు ఉప ఎన్నికలో  ప్రధాన పార్టీలు వేలకోట్లును ఖర్చు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.