Palamuru Politics: పాలమూరులో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ.. కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న నేతలు!

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచింది.

  • Written By:
  • Updated On - July 24, 2023 / 03:34 PM IST

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల గెలుపుతో వచ్చిన జోష్ ను కంటిన్యూ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు చాప కింద నీరులా చేరికలను ప్రోత్సాహిస్తోంది. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో కొంత పట్టున జూపల్లి లాంటి వాళ్లు సైతం కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత మరికొంత మంది లీడర్లు కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. తాజాగా గద్వాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత ఈ మధ్యనే ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

సరిత గద్వాల అసెంబ్లీకి పోటీచేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో తన బలం పెంచుకోవటంలో భాగంగా సరిత భర్త తిరుపతయ్య చక్రం తిప్పారు. ఎలాగంటే గద్వాల జిల్లాలోని 42 మంది నేతలు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. చేరిన వారిలో 30 మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీసీలున్నారు. ఇంకా కొందరు తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. ఒకేసారి దిగువస్ధాయిలోని ప్రజాప్రతినిధులు ఇంతమంది బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ఊహించుండరు.

సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుతో పాటు ఆయన నాయకత్వంలో చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడంలో ఓ ఊపు వచ్చినట్టయింది.. ఇలా నియోజకవర్గాలకు నియోజకవర్గాల్లోని నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరటంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి చాలా ఇబ్బందిగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ సీట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోవాలని గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరినందకు సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీసీ పేరుతో బిసి డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. బీసీలకు టికెట్ కేటాయించడం ద్వారా మరిన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేందుకు ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి బీసీ ప్లాన్ వర్కవుట్ అయితే పాలమూరులో అధికార పార్టీ స్పీడుకు బ్రేకులు పడే అవకాశం ఉంది.

Also Read: Weather Warning: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు