Telangana Betting : తెలంగాణపై భారీ బెట్టింగులు

తెలంగాణ (Telangana)లో ఎన్నికల ఫలితాలపైనే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారీ బెట్టింగులు జరుగుతున్నట్టు వార్తలు వినవస్తున్నాయి.

  • Written By:
  • Updated On - December 1, 2023 / 05:22 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Big Betting on Telangana Party (BRS) : అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా మనం ప్రపంచమంతా చాటి చెప్పుకుంటున్న చోట, ఎన్నికలు కూడా ఒక జూదంలా మారిపోయిన విషాద విచిత్ర సన్నివేశం చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికలు దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎన్నికల ఫలితాలపైనే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారీ బెట్టింగులు జరుగుతున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు తెలంగాణ (Telangana)పై భారీగా బెట్టింగులు కొనసాగినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల విషయంపై బెట్టింగులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో జరగడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి‌. ఆంధ్రప్రదేశ్ కి జూద కేంద్రంగా ప్రసిద్ధికెక్కిన భీమవరంలో ఇంకా విపరీతంగా ఈ బెట్టింగులు కొనసాగుతున్నాయి.

పోలింగ్ పూర్తి కావడంతో ఈ బెట్టింగుల జోరు ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ విచిత్రంగా పోలింగ్ పూర్తయి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత తెలంగాణ (Telangana) ఎన్నికల ఫలితాల మీద మరింత ఉత్కంఠ పెరుగింది. ఇది బెట్టింగుల మీద మరింత ప్రభావం చూపించింది. అది మరింత బెట్టింగులు పెరగడానికి దారి తీసింది. కోట్లు, వందల కోట్లు దాటిపోయి బెట్టింగులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, ఆ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్సూ చెబుతున్నాయి. అయితే స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ కి రాకపోతే ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిమీద ఇప్పుడు బెట్టింగ్ లు జోరు పెరిగింది.

We’re Now on WhatsApp. Click to Join.

తెలంగాణలో మూడో తేదీన ఎలాంటి ఫలితం వస్తుంది, ఆ ఫలితాలు ఆధారంగా ఏ రాజకీయ పరిణామాలు సంభవిస్తాయి అనే దానిపై తీవ్రమైన ఊహాగానాలు సాగుతున్నాయి, చర్చలు సాగుతున్నాయి. అధికారం మాదంటే మాదని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండూ ఎవరికి వారే ప్రకటిస్తున్నారు. అందుకే బెట్టింగ్ రాయుళ్ళకి ఇది పండగలా మారింది. బిజెపి ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, ఎన్ని చోట్ల రెండవ స్థానంలో, ఎన్ని చోట్ల మూడో స్థానంలో బిజెపి ఉంటుందనేది లెక్కలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో ఏడు శాతం మాత్రమే బిజెపికి ఓట్లు రాగా, ఈసారి బిజెపి ఓటు శాతం రెట్టింపు అవుతుందన్న అంచనా వినిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ జయాపజయాలను నిర్ణయించేది బిజెపి మాత్రమే అని కూడా ఒక చర్చ సాగుతుంది. బిజెపి ఒకటి నుంచి ఐదు స్థానాల్లోకి పరిమితమైతే ఆ ప్రభావం ఒకలాగా, పది స్థానాలు దాటితే ఆ ప్రభావం మరొక లాగా ఉంటుంది. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరిచే పూర్తి మెజారిటీ రాదనే అంశం మీద ఒక రకమైన బెట్టింగులు, ఫలానా పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందని మరొక రకమైన బెట్టింగులు, బీఆర్ఎస్కు బిజెపి మద్దతు అవసరమవుతుందా లేదా అనే దానిమీద ఇంకో రకమైన బెట్టింగులు సాగుతున్నాయి.

అంతేకాదు, ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కి కొంచెం మెజారిటీ ఉంటుందని అంచనా వేయడంతో ఒకటికి రెండు రేషియోతో కూడా పందాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ బెట్టింగ్ ల మాట ఎలా ఉన్నా, రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందా, అతుకుల బొంత ప్రభుత్వం ఏర్పడుతుందా అనే గందరగోళం మాత్రం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు కొంచెం సంఖ్య తగ్గినా, దాన్ని పూడ్చుకోవడానికి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క ఎమ్మెల్యే రేటు ఎంత ఘనంగా పలుకుతుందో చెప్పలేం. కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ వస్తే ఆ కథ వేరే ఉంటుంది. రాకపోతేనే కథ అడ్డం తిరుగుతుంది. ఓటర్లకు నోట్ల పంపిణీ దగ్గర నుంచి ఎమ్మెల్యేల కొనుగోలుదాకా బలిసిన పార్టీలతో కాంగ్రెస్ పోటీ పడడం కష్టమే. ఒకవేళ అలా చేయాలనుకున్నా, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే ఇతర పార్టీలు లేవు. ఎంఐఎం, జాతీయస్థాయి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్కు అనుకూలంగా ఉండవచ్చు.

కానీ రాష్ట్రస్థాయి సంబంధాలు ఎంఐఎంకి బీఆర్ఎస్ తో గట్టిగా ఉన్నాయి. అందుకే ఎంఐఎం నాయకులు కాంగ్రెస్కు మద్దతు పలికే అవకాశం లేదు. ఇక బిజెపితో కాంగ్రెస్కు ఉన్న జాతీయ వైరం తెలిసిందే. కాంగ్రెస్ కి ఏమాత్రం సీట్లు తగ్గినా, తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టమవుతుందని ఎన్నికల ముందు నుంచి పలు వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్లో జరిగిన అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజస్థాన్లో పార్టీని చీల్చడానికి బిజెపి ఎలాంటి ప్రయత్నాలు చేసిందో తెలుసు. బిజెపి కర్ణాటకలో మహారాష్ట్రలో సాగించిన మంత్రాంగం కూడా కాంగ్రెస్ కి పెద్ద గుణపాఠమే అవుతుంది. అందుకే రాహుల్ గాంధీ మొదటి నుంచి మాకు పూర్తిస్థాయి ఆధిక్యతను ఇవ్వండి అని, 80కి తగ్గకుండా విజయాన్ని కట్టబెట్టండని రాహుల్ పదేపదే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రేవంత్ రెడ్డి మాకు 80 స్థానాలు తగ్గవని పదే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తిస్థాయి మెజారిటీ కాంగ్రెస్ కి రాకపోతే ఇక పట్టపగలే నడిరోడ్డు మీద ప్రజాస్వామ్యం అంగడి సరుకుగా అయిపోతుంది. ఇదంతా ఏం జరిగినా బెట్టింగు రాయుళ్లకి మాత్రం పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇంకా కొద్ది గంటల్లోనే విషయం తేలిపోతుంది.

Also Read:  KTR: పోలింగ్ పూర్తి కాకుండా ఎగ్జిట్ ఫలితాలా? అవన్నీ చెత్త ఫలితాలు: కేటీఆర్