Site icon HashtagU Telugu

Telangana High Court : భూదాన్ భూముల కేసు.. ఐపీఎస్‌ అధికారులకు హైకోర్టులో చుక్కెదురు

Telangana High Court

Telangana High Court

Telangana High Court : భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రాకు హైకోర్టులో చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఐపీఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి పిటిషన్‌పై ధర్మాసనం ఈరోజు (బుధవారం) విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీల్‌కు ఎందుకు వచ్చారని ఐపీఎస్‌ అధికారులపై మండిపడింది. అలాగే సింగ్‌ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మళ్ళీ సింగిల్ బెంచ్‌కు వెళ్లాలని ఐపీఎస్‌లకు డివిజన్ బెంచ్ సూచించింది.

Read Also: NSAB : పాక్‌తో కయ్యం వేళ ఎన్‌ఎస్‌ఏబీ పునర్ వ్యవస్థీకరణ.. ఛైర్మన్‌గా అలోక్‌ జోషి.. ఎవరు ?

కేసులో తదుపరి వాదనలు కూడా సింగిల్ బెంచ్‌‌‌లోనే వినిపించాలని ఐపీఎస్ తరఫు న్యాయవాదులకు సూచించింది. ఆపై ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ముగించింది. కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్​ 181, 182, 194, 195లోని భూదాన్​ భూములు అన్యాక్రాంతం అయినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అందులో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. దీనిపై ఈ నెల 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. అవి భూదాన్‌ భూములే అని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ తాజాగా కొందరు ఐపీఎస్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో రవిగుప్తా, మహేశ్‌ భగవత్‌, శిఖా గోయల్‌, తరుణ్‌ జోషి, రాహుల్‌ హెగ్డె, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు. ఇక, ఆ భూములు భూదాన్‌వి కాదని, పట్టా భూములేనంటూ ఆ ఐపీఎస్‌ అధికారులు హైకోర్టుకు నివేదించారు. సర్వే నంబరు 194లో 16, 20, 18 గుంటల విస్తీర్ణాలతో కొనుగోలు చేశామన్నారు. దీనికి సంబంధించిన విక్రయ ఒప్పందపత్రాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈక్రమంలో బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించింది.

Read Also: Pahalgam Attack : పహల్గాం దాడి దృశ్యాలను విడుదల చేసే యోచనలో కేంద్రం..!