TG : కరెంట్ కటింగ్ పై కేసీఆర్ ట్వీట్ కు భట్టి కౌంటర్ ట్వీట్..

కేసీఆర్ గారు నిద్ర లేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు

  • Written By:
  • Publish Date - April 28, 2024 / 12:20 PM IST

బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) నిన్న శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సోషల్ మీడియా లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అడుగుపెట్టడమే ఆలస్యం కాంగ్రెస్ (COngress) పై తీవ్ర స్థాయిలో విమర్శలతో ట్వీట్స్ మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఉద్య‌మ కాలం నాటి త‌న ఫొటోను కేసీఆర్ జ‌త చేశారు. ఆ తర్వాత బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అని కోరుతూ రెండో ట్వీట్ చేశారు.

మూడో ట్వీట్ కరెంట్ కటింగ్ లపై చేసారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి అని కేసీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ట్వీట్ కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) కౌంటర్ ట్వీట్ చేసారు. శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు కరెంటు పోయిందని కేసీఆర్ ట్విట్టర్‌లో చేసిన ప్రకటన పూర్తిగా అబద్దం. సబ్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగింది అది డిజిటల్ మీటర్‌లో ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే రీడింగ్ చేస్తుందని పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో నమోదు చేసిన రీడింగ్, పరిసర ప్రాంత ప్రజల ఇళ్లలో ఎలాంటి కరెంటు కోతలు జరగలేదని , నిరంతర విద్యుత్ సరఫరా జరిగింది అని అధికారులు నిర్ధారించారని వెల్లడించారు. కేసీఆర్ గారు నిద్ర లేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇటీవల సూర్యాపేట పట్టణంలో సైతం ఇదే తరహాలో విద్యుత్ శాఖను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించి అబాసు పాలయ్యారని పేర్కొన్నారు.

 

Read Also : Pawan Kalyan : అందరి ముందు ఓపెన్‌గా.. పవన్‌కి మద్దతు ఇచ్చిన నిర్మాత..