Site icon HashtagU Telugu

Bharat Ratna PV : మన పీవీ.. తెలుగుజాతి ఠీవీ.. నర్సింహారావు జీవిత విశేషాలివీ

Pv Narasimha Rao Pm Post

Pv Narasimha Rao Pm Post

Bharat Ratna PV :  తెలుగుజాతి ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ వరించింది.   ఈనేపథ్యంలో పాములపర్తి వేంకట నర్సింహారావు జీవిత ప్రస్థానంలోని కీలక ఘట్టాలను ఓసారి తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

విద్యాభ్యాసం సాగిందిలా.. 

పీవీ నర్సింహారావు 1921 జూన్ 28న తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు.  అనంతరం పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు నరసింహారావును దత్తత తీసుకోవడంతో ఆయన పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యారు. కరీంనగర్‌ జిల్లా వంగరలో ప్రాథమిక విద్యను, హనుమకొండలో మెట్రిక్యులేషన్‌ వరకు పీవీ చదువుకున్నారు. హయ్యర్‌ సెకండరీలో హైదరాబాద్‌ సంస్థానంలోనే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. పీవీకి పదేళ్ల వయసులో సత్యమ్మతో వివాహమైంది. వారికి ముగ్గురు కుమారులు, అయిదుగురు కుమార్తెలు. తెలంగాణలో వందేమాతర గీతాన్ని నిషేధించిన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పీవీ గళం విప్పారు. 1938లో హైదారాబాద్​ రాష్ట్ర కాంగ్రెస్​లో చేరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 300 మంది విద్యార్థులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర గీతం ఆలపించారు. ఫలితంగా కళాశాల నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. తన స్నేహితుడి సహాయంతో నాగ్​పూర్​లో చదువు కొనసాగించారు. అక్కడే ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.  పూణేలోని పెర్గ్యూసన్ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ పట్టాపొందారు. నాగ్‌పూర్‌లో ఎల్‌ఎల్​బీ చేశారు.

Also Read : Auto Drivers 12000 : ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12వేల ఆర్థిక సాయం

స్వామి రామానంద తీర్థ బాటలో పీవీ

1939లో త్రిపురలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు పీవీ నర్సింహారావు(Bharat Ratna PV )హాజరయ్యారు. సుభాష్‌చంద్రబోస్‌ వంటి దిగ్గజాల ప్రసంగాల విని పీవీలో ఉత్తేజం నిండింది. తెలంగాణ కాంగ్రెస్‌ దిగ్గజం బూర్గుల రామకృష్ణారావు వద్ద పీవీ జూనియర్‌ లాయర్‌గా చేరారు.  ఆ టైంలో స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ స్టేట్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని విలీనానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈవిషయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అతివాద, మితవాద గ్రూపులుగా విడిపోయింది.పీవీ మాత్రం తన గురువు రామానందతీర్థ వైపు మళ్లారు. భారత యూనియన్‌ సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించిన వెంటనే నిజాం నవాబు లొంగిపోయాడు.

1957లో శాసనసభ్యుడిగా..

పీవీ నర్సింహారావు 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించారు. 1991లో ప్రధాని పదవి చేపట్టి.. సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించి తన నాయకత్వం పటిమను ప్రపంచానికి చాటిచెప్పారు.చైనా, ఇరాన్‌లతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.  ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు సరికొత్త సంస్కరణలకు బీజం వేశారు. అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో కలిసి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలో దేశం ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబ్‌లో ఖలిస్థానీ తీవ్రవాదాన్ని, కశ్మీరులో ప్రముఖులను ఉగ్రవాదులు బంధిస్తే.. వారి డిమాండ్లకు తొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే.

Also Read :  Bharat Ratna : పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు భారతరత్న

ప్రధానిగా ఒకే ఒక్క తెలుగువాడు

భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 వరకు పీవీ పనిచేశారు. ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు మన పీవీ. 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదట మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. 1994లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుంచి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని, 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టేందుకు పరోక్షంగా సహకరించారని, సాధువులకు, బాబాలకు అతి సన్నిహితంగా ఉండేవారని పీవీపై విమర్శలు ఉన్నాయి. 2004 డిసెంబర్ 23న పీవీ నర్సింహారావు తుదిశ్వాస విడిచారు.