Site icon HashtagU Telugu

Bharat Biotech : ఓరల్‌ కలరా వ్యాక్సిన్‌ విడుదల చేసిన భారత్ బయోటెక్

Bharat Biotech Oral Cholera Vaccine

Bharat Biotech : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రఖ్యాత వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ ఓరల్‌ కలరా వ్యాక్సిన్‌ను ఇవాళ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆ వ్యాక్సిన్‌కు  ‘హిల్‌ కాల్‌’ (బీబీవీ131) అనే పేరు పెట్టింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం నోటి ద్వారా అందించే  కలరా వ్యాక్సిన్ కొరత నెలకొంది. ఆ కొరతను తీర్చే లక్ష్యంతోనే ‘హిల్‌ కాల్‌’ పేరుతో ఓరల్ కలరా టీకాను విడుదల చేశామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా  2023 సంవత్సరం మార్చి నుంచి ఇప్పటివరకు 8,24,479 మందికి కలరా సోకింది. అయితే తగిన చికిత్స అందకపోవడంతో వారిలో 5,900 మంది చనిపోయారు. దాదాపు 31 దేశాల్లో కలరా మహమ్మారి సమస్య తీవ్రంగా ఉంది. ఈ అవసరాలను తీర్చి, ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు భారత్ బయోటెక్(Bharat Biotech) తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join

సింగపూర్‌కు చెందిన హిల్ మ్యాన్ లేబొరేటరీస్ నుంచి లైసెన్సును తీసుకొని తాము సరికొత్త  ‘హిల్ కాల్’ ఓరల్ కలరా టీకాను డెవలప్ చేశామని భారత్ బయోటెక్ తెలిపింది. ఇది సింగిల్ స్ట్రెయిన్ కలరా వ్యాక్సిన్ అని పేర్కొంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల కలరా టీకాలు అవసరమని వెల్లడించింది. కానీ వాటి లభ్యత అంతగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని చెప్పింది. భారత్ బయోటెక్‌కు చెందిన హైదరాబాద్, భువనేశ్వర్‌ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లలో దాదాపు 20 కోట్ల హిల్ కాల్ ఓరల్ కలరా వ్యాక్సిన్ డోసులను తయారు చేయనున్నారు.  ఈ వ్యాక్సిన్‌తో నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. మూడో దశ ప్రయోగ పరీక్షలోనూ హిల్ కాల్ వ్యాక్సిన్ సురక్షితమైందని నిర్ధారణ అయినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సురక్షితమైన వ్యాక్సిన్లను అందించే విషయంలో తాము రాజీపడకుండా ముందుకు సాగుతామని భారత్ బయోటెక్ తెలిపింది. కరోనా సమయంలోనూ తాము భారత దేశానికి అవసరమైన కొవిడ్ వ్యాక్సిన్లను అందించిన విషయాన్ని గుర్తుచేసింది.

Also Read : Airtel – Apple : ఎయిర్‌టెల్ కస్టమర్లకు యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ సేవలు