Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పురుషోత్తపట్నం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) రమాదేవిపై గ్రామస్థులు దాడి చేయడం కలకలం రేపింది. ఆలయానికి చెందిన భూములను ఆక్రమణదారుల నుంచి రక్షించేందుకు వెళ్లిన ఈవోపై గ్రామస్థులు ఫిజికల్‌గా దాడికి తెగబడ్డారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోవడంతో వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పురుషోత్తపట్నం గ్రామ పరిధిలో భద్రాచలం దేవస్థానానికి సుమారు 889.50 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ భూములపై వివాదాలు తలెత్తగా, చివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆలయ హక్కును గుర్తించి ఆ భూములను తిరిగి దేవస్థానానికి అప్పగించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పూర్తిగా విస్మరించి, కొందరు ఆక్రమణదారులు అక్కడ నిర్మాణాలు చేపట్టారు.
Read Also: Ahmedabad : ఎయిరిండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక
ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు నిర్ణయించగా, ఈవో రమాదేవి స్థానిక పోలీసుల సాయంతో స్థలాన్ని పరిశీలించేందుకు పురుషోత్తపట్నానికి వెళ్లారు. అక్కడే కొందరు స్థానికులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి ఆలయ సిబ్బంది కూడా తీవ్రంగా స్పందించడంతో గ్రామస్థులకు, దేవస్థాన అధికారులకు మధ్య ఘర్షణ ముదిరింది. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై భద్రాచలం పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ భూముల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, హిందూ మతపరమైన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈవో రమాదేవి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన దేవస్థాన భూముల విషయంలో అధికారుల భద్రతపై ప్రశ్నలు వేస్తోంది. ప్రభుత్వ హస్తక్షేపంతోనే ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.