Bhadrachalam: భద్రాచలం ఆలయంలో స్వామి వారికి నూతన పూజలు..!

భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయం (Temple)లో త్వరలోనే నూతన పూజలను ప్రవేశ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కొత్తగా అమలు చేయనున్న వీటిపై అభ్యంతరాలు, సలహాలు వారం లోగా భద్రాచలం (Bhadrachalam) ఆలయ కార్యాలయంలో రాతపూర్వకంగా అందించాలని ఈవో శివాజీ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని అంశాలను పరిశీలించి వీలైనంత తొందర్లోనే వీటిని ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇది ఆదాయ వనరుగా ఉండటంతో పాటు భక్తులు ఎక్కువ సేపు దేవుడి సన్నిధిలో ఉండేందుకు వెసులుబాటు లభించనుంది. ఐదేళ్ల క్రితం శ్రీరామ రక్షా పూజను ఏర్పాటు చేసి దీన్ని నిర్వహించడం మానేశారు. ఇటీవల దేవాదాయ శాఖ కొత్త పూజలను ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ ఇక్కడ చలనం కరవైంది.

నిత్య సర్వ కైంకర్య సేవ:

టిక్కెట్‌ ధర రూ.5 వేలు. ఇది ప్రతిరోజూ ఉండే ఉదయాస్తమాన సేవ. ఈ పూజ చేయించానుకున్న రోజు జరిగే అన్ని పూజల్లో దంపతులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనవచ్చు. సుప్రభాతం, అభిషేకం, అంతరాలయ అర్చన, శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి అర్చన, శ్రీఆంజనేయస్వామి వారి అర్చన, నిత్య కల్యాణం, సచిత్ర రామాయణ పుస్తకం, దర్బారు సేవ, పవళింపు సేవలో పాల్గొనవచ్చు. ముత్యాల తలంబ్రాల పొట్లం అందిస్తారు. ఐదుగురికి అన్నదానం వర్తిస్తుంది. అయితే ఆదివారం నిర్వహించే అభిషేకానికి విశేష ఆదరణ ఉండడంతో ఆ రోజు మాత్రం నిత్య సర్వ కైంకర్య సేవకు 10 టిక్కెట్లను మాత్రమే కేటాయించనున్నారు. ఈ పూజను ఆదివారం చేయించుకునే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది రామాలయానికి భారం కాకుండా చూడాలి.

నిత్య పుష్పాలంకరణ సేవ:

దీని ధర రూ.5 వేలు. ఇది సోమవారం నుంచి శనివారం వరకు ఉంటుంది. భక్తులు పూజ చేయించాలనుకున్న రోజున ప్రధాన ఆలయంలో మూల విరాట్‌తో పాటు అనుబంధం కోవెళ్లలోని దేవుళ్లకు పూల దండలను సమర్పిస్తారు. కండువా, జాకెట్‌ క్లాత్‌, 100 గ్రాముల బరువు గల రెండు లడ్డూలు, ఒకరికి లేదా దంపతులకు అంతరాలయ అర్చన, నలుగురికి అన్నదానం వర్తిస్తుంది.

శ్రీరామ నవమి ముత్యాల సమర్పణ:

దీని ధర రూ.10 వేలు. శ్రీరామ నవమి కల్యాణ టిక్కెట్‌(ఉభయం), 108 ముత్యాలు గల తలంబ్రాల ప్యాకెట్‌ను అందించడంతో పాటు ఉభయ దాతకు కల్పించే అన్ని సదుపాయాలు అందిస్తారు.

వేద ఆశీర్వచనం:

టిక్కెట్‌ ధర రూ.500. దర్శనం తర్వాత బేడా మండపంలో దంపతులు లేదా ఒక్కరికి అవకాశం ఉంది. ఉదయం 9.30, 10,00, 10.30, 11,00 గంటలకు ఉంటుంది. భక్తులకు కండువా, జాకెట్‌ ముక్క, 100 గ్రాముల బరువు గల రెండు లడ్డూలను ఆలయం తరఫున అందిస్తారు.

తులసి దండ అలంకరణ:

దీని ధర రూ.1,000. ప్రతి శనివారం ఉదయం 7 గంటలకు. ఒకరు లేదా దంపతులకు అవకాశం. ఉభయ దాత శిరస్సుపై తులసి దండ ఉంచి ఆలయ ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత భక్తుల సమక్షంలో అంతరాలయంలో స్వామివారికి దండను అలంకరిస్తారు. కండువా, జాకెట్‌ వస్త్రం, 100 గ్రాముల బరువు గల రెండు లడ్డూలు, రామకోటి పుస్తకాన్ని భక్తులకు అందిస్తారు.

తులాభారం:

టిక్కెట్‌ ధర రూ.100. ఇది ప్రతిరోజూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు ఉంటుంది. ఇందులో భక్తులు తన బరువుకు తగిన మొక్కును రాములవారికి సమర్పించుకోవచ్చు. బెల్లం, కంది పప్పు, పుష్పాలు, పంచదార, వాహనాలు, డబ్బులు ఇలా ఏదైనా మొక్కును తులాభారం రూపంలో చెల్లించుకునే వీలుంది.

Also Read:  Arunachalam: అరుణాచలం ఆలయ ప్రాముఖ్యత, గిరి ప్రదక్షిణ విశేషాలు..