Mango Adulteration వేసవి వచ్చిందంటే చాలు, పండ్లలో రారాజైన మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే, మార్కెట్లో కంటికి ఇంపుగా కనిపించే ఈ పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్న మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కీలక సూచనలు చేశారు.
కొందరు స్వార్థపరులైన వ్యాపారులు, కేవలం కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సహజ సిద్ధంగా కాకుండా, కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను పండ్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. రోడ్డు పక్కన నిగనిగలాడుతూ, ఒకే రకమైన పసుపు పచ్చ రంగులో ఆకర్షణీయంగా కనిపించే పండ్లను చూసి మోసపోవద్దని సూచించారు.
సహజంగా పండిన పండు అన్నిచోట్లా ఒకే రంగులో ఉండదని, కానీ రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండు పైన పసుపుగా ఉన్నా లోపల పచ్చిగా, రుచిహీనంగా ఉంటుందని వివరించారు. ఇలాంటి కల్తీ పండ్లను తినడం ప్రాణాంతకం కాగలదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారని సజ్జనార్ తెలిపారు. వీటిని తినడం వల్ల తక్షణమే గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ రసాయనాలు శరీరంలోకి చేరడం వల్ల దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తవచ్చని వివరించారు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి కల్తీ వ్యాపారాలపై హైదరాబాద్ పోలీస్ విభాగం ఉక్కుపాదం మోపుతోందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇప్పటికే హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందాలు నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండ్ల రూపాన్ని చూసి కాకుండా, సహజత్వాన్ని గమనించి కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసాధారణ రంగు, రసాయన వాసన, వింత రుచి ఉన్న పండ్లకు దూరంగా ఉండాలన్నారు.
ఎక్కడైనా కల్తీ మామిడి పండ్లను విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు గానీ, హెచ్-ఫాస్ట్ వాట్సాప్ నంబర్ 8712661212కు గానీ ఫిర్యాదు చేయాలని కోరారు.
