బెట్టింగ్ యాప్స్ కేసు ( Betting App Case ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బీటింగ్ యాప్ లను ప్రమోట్ చేసారని చెప్పి ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలకు పోలీసుల నోటీసులు అందించడం , విచారించడం మొదలుపెట్టారు. ఈ నోటీసుల పై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారు చేసిన తప్పు ఏమిటి? అసలు సమస్య యాప్ నిర్వాహకులదా? లేక ప్రచారం చేసినవారిదా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. యాప్ నిర్వాహకులు నేరపూరితంగా డబ్బును సేకరిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరం. కానీ వారి ప్రకటనలను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను నేరస్తులుగా మార్చడం సరైనదా? అనే విమర్శలు వస్తున్నాయి. అందుకే పోలీసులు కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.
ఇప్పటివరకు పోలీసులు పలువురు సెలబ్రిటీలను నిందితులుగా కేసు నమోదు ( Betting App Case ) చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది చాలా మందికి నష్టం కలిగించే అంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ఇన్‌ఫ్లూయన్సర్లు, యూట్యూబర్లు, సినిమా తారలు ఇలా ఎన్నో విభాగాల నుండి ప్రజాదరణ పొందిన వ్యక్తులు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. వారంతా ఈ యాప్స్ వెనుక అసలు జరుగుతున్న అసత్యాలను పూర్తిగా తెలుసుకోకుండానే ప్రమోషన్ చేసినట్లు అనుకోవచ్చు. అందుకే వీరిని నేరస్తులుగా కాకుండా సాక్షులుగా మార్చి, అసలు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.
ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అసలు నిందితులను పట్టుకోవడం సులభమవుతుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ( Betting Apps) అన్నీ ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా నడుస్తాయి. ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం పోలీసులకు పెద్ద కష్టం కాదు. అసలు నిర్వాహకులను జైలుకు పంపి, వారి అక్రమ సంపాదనను స్వాధీనం చేసుకోవడమే అసలు సరైన చర్య అవుతుంది. సెలబ్రిటీలు ప్రమోట్ చేసినందుకు మాత్రమే వారిని అరెస్ట్ చేయడం ఒకింత అన్యాయంగా మారే అవకాశం ఉండటంతో, ఇప్పుడు వారికి మరో అవకాశం ఇస్తూ, అసలు నిందితులపై దృష్టి పెట్టాలని నిర్ణయించడం సమంజసమైన పరిష్కారంగా కనిపిస్తోంది.