Site icon HashtagU Telugu

Beerla Ilaiah : యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తాం

Beerla Ailaiah

Beerla Ailaiah

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి నిర్మాణం గురించి అందరికీ తెలిసింది. అయితే.. నిర్మాణ సమయంలో యాదగిరిగుట్టగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం పేరును యాదాద్రిగా మార్చారు అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (KCR). అయితే.. ఇప్పుడు యాదాద్రిగా ఉన్న పేరును యాదగిరిగుట్టగానే మారుస్తామని అంటున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య. ఆయన నిన్న యాదాద్రిలో కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని ప్రారంభించిన ఆనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revavnth Reddy) దృష్టికి తీసుకెళ్తానని ఆయన ఉద్ఘాటించారు. క్షేత్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి దర్శనానికి వస్తారని తెలిపారు. నెల రోజుల్లోనే సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఆలయానికి విచ్చేసిన బీర్ల అయిలయ్యకు ఆలయ ఈవో రామకృష్ణా రావు, ధర్మకర్త నరసింహమూర్తి స్వాగతం పలికారు. అనంతరం ఆయన దైవ దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు.
We’re now on WhatsApp. Click to Join.

అయితే.. కొన్ని వందలు ఏళ్లుగా యాదగిరిగుట్ట పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రం పేరును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యాదాద్రిగా మార్చిందని ఎమ్మెల్యే అన్నారు. భద్రాచలం పేరును కూడా మార్చిందని ఇది సంప్రదాయానికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ పదాలే ముఖ్యమని బీర్ల అయిలయ్య చెప్పుకొచ్చారు. 60 ఏళ్లపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్రా పేర్లు ఉండొద్దని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారని, ఇది విని తన జన్మ నిజంగా ధన్యమైనట్టు అనిపించిందన్నారు బీర్ల అయిలయ్య. అతి త్వరలో యాదాద్రికి యాదగిరి గుట్టగా సీఎం నామకరణం చేస్తారని బీర్ల అయిలయ్య చెప్పారు. పాత సంప్రదాయాలు పునరుద్ధరిస్తామని, ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా.. కొండపై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వెల్లడించారు. పది రోజుల్లో హాల్ నిర్మాణం చేయాలని, ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆదేశించారు.