Site icon HashtagU Telugu

Liquor Sales : వామ్మో.. తెగ తాగేస్తున్నారు..తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మ‌కాలు

Beer

Beer

తెలంగాణ వ్యాప్తంగా బీర్ల విక్ర‌యాలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో పెరుగుతున్న వేస‌వి ఉష్ణోగ్ర‌త‌ల‌ను అధిగ‌మించ‌డానికి ప్ర‌జ‌లు మాల్ట్ పానీయాన్ని తీసుకోవ‌డంతో బీర్ల విక్ర‌యాలు పెరిగిన‌ట్లు తెలుస్తుంది. ప్రతి వేసవిలో బీర్ విక్రయాలు పెరుగుతున్నప్పటికీ, కరోనావైరస్ మహమ్మారి బారిన పడ‌తార‌నే భయంతో ప్రజలు చల్లని వస్తువులను తినకుండా ఉండటంతో 2020, 2021లో మునుపటి రెండు వేసవి సీజన్‌లలో బీర్ల అమ్మాకాలు త‌గ్గాయి. క‌రోనా త‌గ్గ‌డం, ప్రజలు సాధారణ స్థితికి రావడంతో ఈ ఏడాది మార్చిలో వేసవి ప్రారంభమైన తర్వాత బీర్ల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చి 1 నుంచి ఏప్రిల్ 11 వరకు బీర్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ నుంచి లభించిన సమాచారం. మార్చి 1వ తేదీ నుంచి గడిచిన 42 రోజుల్లో దాదాపు 5.30 కోట్ల లీటర్ల బీరు విక్రయాలు జరగ్గా, తెలంగాణ రాష్ట్రంలో 3.59 కోట్ల లీటర్ల హార్డ్ లిక్కర్ విక్రయించి ఎక్సైజ్ శాఖకు రూ.3,614 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే సమయానికి 3.78 కోట్ల లీటర్ల బీరు, 3.56 కోట్ల లీటర్ల హార్డ్ లిక్కర్ అమ్ముడుపోయి రూ.3,302 కోట్లకు చేరింది. బీరు విక్రయాలు 40.46 శాతం పెరగ్గా, హార్డ్ లిక్కర్ అమ్మకాలు కేవలం 10 శాతం మాత్రమే పెరిగాయి. ఏప్రిల్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అమ్మకాలను మరింత పెంచాయి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 11 వరకు 11 రోజుల్లో 74.94 లక్షల లీటర్ల హార్డ్ లిక్కర్‌కు గాను 1.39 లక్షల లీటర్ల బీరు అమ్ముడైంది. గతేడాది ఇదే గణాంకాల ప్రకారం బీరు 1.11 కోట్ల లీటర్లు, 84.64 లక్షల లీటర్ల హార్డ్ లిక్కర్. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు వైన్ షాపుల ద్వారా సగటున రోజుకు రూ.100 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.