Data Engineer: నేటి డిజిటల్ యుగంలో డేటా ఇంజినీరింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. డేటాను విశ్లేషించేందుకు, నిర్వహించేందుకు నైపుణ్యమున్న మానవ వనరుల (Data Engineer) కోసం పరిశ్రమలు అన్వేషిస్తున్నాయి. ఈ రంగంలోని ఉపాధి అవకాశాలను తెలంగాణ యువత అందిపుచ్చుకునేలా వారిని తీర్చి దిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మార్గనిర్దేశనంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), శ్రీ సత్య సాయి సేవా సంస్థ సంయుక్తాధ్వర్యంలో “డేటా ఇంజినీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం’ పేరిట ఉచిత శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రోగ్రామింగ్ అండ్ డేటా అనాలసిస్, డేటా ఇంజినీరింగ్ టూల్స్, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా విజువలైజేషన్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై పట్టభద్రులకు 90 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులో 25 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవమున్న అధ్యాపకుల పర్యవేక్షణలో 120 గంటలు క్లాస్ రూం కోచింగ్, 360 గంటల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రత్యేకంగా కెరీర్ కౌన్సెలింగ్ ఇస్తారు.
Also Read: MLC Elections : హోరాహోరీగా ఎమ్మెల్సీ పోల్స్.. రాజకీయ ఉత్కంఠ
కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్లేస్ మెంట్స్ కల్పిస్తారు. 2021 నుంచి 2024 మధ్య కాలంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను హైదరాబాద్ లోని టాస్క్ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలోని శ్రీ సత్య సాయి సేవా సంస్థలో శిక్షణ ఇస్తారు. ఈ ప్రవేశ పరీక్షకు వచ్చే నెల ఒకటో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కార్యాలయం శుక్రవారం జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాలు, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు https://task.telangana.gov.in/ను సందర్శించాలని కోరింది.