Site icon HashtagU Telugu

BC Bandhu: బీసీ బంధు పంపిణీకి సర్వంసిద్ధం, త్వరలో బీసీలకు లక్ష సాయం

1 Lakh For Bcs

1 Lakh For Bcs

ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పలు పథకాల అమలును వేగవంతం చేస్తోంది. ఆయా పథకాల ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 15నుంచి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తారు. నియోజకవర్గానికి 50 మంది చొప్పున 119 నియోజకవర్గాల్లో 5,950 మంది ఆర్థిక సాయం అందుకోబోతున్నారు.

మండలానికి సుమారు 10 కుటుంబాలకు అవకాశం లభిస్తుంది. బీసీలకు ఆర్థిక సాయం కోసం బీసీ కార్పొరేషన్‌ కు బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించారు. అదనంగా మరో 200 కోట్ల రూపాయలు కేటాయించారు. తొలివిడతలో దాదాపు 60 కోట్ల రూపాయల వరకు ఇందుకోసం ఖర్చు చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక, తొలి విడత జాబితాపై కలెక్టర్లు, బీసీ సంక్షేమశాఖ అధికారులతో ఈరోజు కీలక సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్షలో జాబితాలు ఖరారు అవుతాయి.

లబ్ధిదారులకు అందించే లక్ష రూపాయల ఆర్థిక సాయంతో కులవృత్తులకు అవసరమైన సామగ్రి, పనిముట్లు కొనుగోలు చేసేలా చూస్తారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీరి నుంచి ప్రతి నెలా నియోజకవర్గానికి 50మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. తొలి విడతలో 5950మందికి ఆర్థిక సాయం చేస్తారు. ప్రతి నెలా 15వతేదీ నాటికి లిస్ట్ లు రెడీ చేసి ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అయితే ఈ పథకాన్ని పొందేందుకు కావాల్సిన పత్రాలు లేకపోవడంతో చాలామంది సంబంధిత కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది దళారులు లక్ష సాయం అందేలా చేస్తామని లబ్ధిదారులను మోసగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.