Site icon HashtagU Telugu

Caste Census : భట్టి విక్రమార్కను సన్మానించిన బీసీ సంఘాలు

Bhatti Kmm

Bhatti Kmm

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన (Caste Census) చేపట్టాలని ప్రకటించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత తొలిసారిగా కులగణన చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ నిలవడమే కాక, శాస్త్రీయంగా, పకడ్బందీగా ఈ ప్రక్రియను పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ విజయానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఎఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో ఏర్పడిన ఒత్తిడి కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, గుజరాత్ సిడబ్ల్యుసి సమావేశం నుంచి పార్లమెంటు వరకూ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమం కేంద్రాన్ని ఒప్పించగలిగింది.

Poonam Gupta: ఆర్బీఐలో డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ పాత్ర ఏంటీ? ఈఎంఐలు నిర్ణ‌యిస్తారా!

రాష్ట్రంలో కులగణన సర్వేలో కులాల గణాంకాలే కాక, ప్రజల ఆర్థిక, రాజకీయ, ఉపాధి స్థితిగతులపై వివరాలు సేకరించారు. 150 ఇండ్లను బ్లాక్‌గా తీసుకుని, ఎన్యుమరేటర్ల ద్వారా సర్వే నిర్వహించారు. మొత్తం 50–55 రోజుల్లో సర్వేను ముగించి, ఏ తప్పులూ లేకుండా అసెంబ్లీలో బిల్‌ ప్రవేశపెట్టారు. ఈ సర్వే ఆధారంగా బీసీలకు తగిన విధంగా అభివృద్ధి, సంక్షేమ విధానాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణతో సమర్థవంతంగా సాగిన ఈ ప్రక్రియ, సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచింది.

ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన బీసీ సంఘాల కార్యక్రమంలో భట్టి విక్రమార్కకు ఘన సన్మానం జరిగింది. బీసీ ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నేతలు ఆయన శ్రమను ప్రశంసించారు. వారు పేర్కొన్నట్లుగా, శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న బీసీ వర్గాల అన్యాయాలను ఈ కులగణన ద్వారా పరిష్కరించే దిశగా ముందడుగు పడింది. 42 శాతం రిజర్వేషన్ల అమలు ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమైందని, బీసీలు ఈ విజయాన్ని మరింత బలపరచేందుకు ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కులగణన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని వారు నొక్కి చెప్పారు.