Site icon HashtagU Telugu

Bandi Sanjay: ఆగస్టు 26న పామునూరు నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. పాదయాత్రను నిలిపివేయాలంటూ వరంగల్ పోలీసులు జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడ ఆగితే అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. రేపు ఉదయం 8 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం పామునూరు నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. అయితే ట్రెక్ రూట్ మ్యాప్‌లో కొన్ని మార్పులు చేశారు. ఎల్లుండి ఉదయం వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకోనున్నారు.

బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను ఉదయం పెన్‌డ్రైవ్‌లో సమర్పించింది ప్రభుత్వం. అయితే, పెన్‌డ్రైవ్‌ ఆధారాలు కోర్టులో చెల్లవని కోర్టు వ్యాఖ్యానించింది. డాక్యుమెంట్ల రూపంలో ఆధారాలు సమర్పించకపోవడంపై ప్రభుత్వం, పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు యాత్రకు అనుమతి తీసుకున్నారా అని బండి సంజయ్ తరఫు లాయర్లను కోర్టు ప్రశ్నించింది. అయితే, తాము యాత్రకు ముందుగానే అనుమతి తీసుకున్నామని, పాదయాత్ర జరిగే ప్రతి కమిషనరేట్ పరిధిలో అనుమతి తీసుకున్నట్లు బండి తరఫు లాయర్లు చెప్పారు.

ఈ నెల 27న హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. సభ జరిగే రోజు మధ్యాహ్నం వరకు పాదయాత్ర కొనసాగించనున్న బండి సంజయ్ నేరుగా బహిరంగ సభకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ నుంచి పామునూరు బయలుదేరిన సంజయ్ ఈ రాత్రి అక్కడే బస చేయనున్నారు. మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు యువకులు భారీ సంఖ్యలో సిద్ధమయ్యారు.