Site icon HashtagU Telugu

BJP-BRS Alliance: బిజెపి-బిఆర్‌ఎస్ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి

BJP-BRS Alliance

BJP-BRS Alliance

BJP-BRS Alliance: మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా మొదలైంది. కాగా తెలంగాణలో ఈ సారి లోక్‌సభ ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగేలా కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లను దక్కించుకునే క్రమంలో రేవంత్ సర్కార్ పావులు కదుపుతుంది. ఇక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా, వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని అనుకుంటుంది. సో.. మొత్తానికి ఈ సారి లోక్‌సభ ఎన్నికల జోరు మాములుగా ఉండేలా లేదు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్‌ఎస్ పొత్తుకు అవకాశం ఉందన్న వార్తలను కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఖండించారు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఉరికించి కొడతారని పేర్కొన్నారు. తాండూరులో జరిగిన బీజేపీ పార్టీ విజయ సంకల్ప సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారితో పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు బండి సంజయ్. బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే తెలంగాణ బీజేపీ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కొడతారని వ్యాఖ్యానించారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ-బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేస్తాయని ఎవరైనా రాజకీయ నాయకులు కామెంట్స్ చేస్తే చెప్పు చూపించండని కార్యకర్తలకు బండి సూచించారు. మీడియాలో ఈ లీక్‌లకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ న్యూఢిల్లీ పర్యటన గురించి మాట్లాడుతూ.. స్కాచ్ బాటిల్ కోసమో, లేక కాలు నొప్పి కోసమో ఢిల్లీ వెళుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా ఢిల్లీలో ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి ఢిల్లీలో ఎవరూ సిద్ధంగా లేరని సంజయ్ అన్నారు. బీజేపీని నాశనం చేసేందుకు బీఆర్‌ఎస్ పుట్టింది. వాళ్ళు మనల్ని దెయ్యాలలా వదలడం లేదన్నారాయన.

కాగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. 543 మంది లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు ఏప్రిల్ మరియు మే మధ్య లోక్‌సభకు సాధారణ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. తెలంగాణాలో ఎన్నికలకు సన్నాహకంగా ఫిబ్రవరి 20 నుండి మార్చి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘విజయ సంకల్ప యాత్రలు’ నిర్వహిస్తోంది బిజెపి.

Also Read: MLC Kavitha: గురుకులాల పనితీరుపై సమీక్షించండి, వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి!