టీఆరెస్ పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో భారత రాజ్యంగంలోని ఆదర్శాలు అమలు చేయాలని…ప్రొటోకాల్ పాటించాలని గవర్నర్ కోరితే ఆమెపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గొర్రెలు మహిళలను గౌరవించడం లేదని…బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాటించడం లేదని దుమ్మెత్తిపోశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు బండి సంజయ్. కల్వకుంట్ల రాజ్యాంగం ప్రతిపాదకుల నుంచి మనం ఏం ఆశించగలమంటూ ఎద్దేవా చేశారు.
గవర్నర్ గా తమిళిసై మూడేండ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విషయంపై సర్కార్ అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్, అసెంబ్లీ తన ప్రసంగం, వంటి అంశాలపై తమిళిసై ప్రస్తావించారు. గవర్నర్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. గవర్నర్ వ్యాఖ్యలను అధికారపార్టీ నేతలు విమర్శిస్తూ..బీజేపీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఇవాళ బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.