Site icon HashtagU Telugu

Bandi Sanjay : సంజ‌య్ ఉవాచ

Bandi letter to cm kcr

Kcr Bandi

చంద్ర‌బాబునాయుడు మాదిరిగా కేసీఆర్ కూడా రాజ‌కీయ క‌నుమ‌రుగు అవుతాడ‌ని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. ఆ మేర‌కు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆ వ్యాఖ్య‌లోని ఆంత‌ర్యాన్ని ఒక‌సారి ప‌రికిస్తే, చంద్ర‌బాబు రాజ‌కీయంగా క‌నుమ‌రుగు అయ్యాడ‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. దీనిలో ఎంత నిజ‌మో విశ్లేషిస్తే..ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా క‌నుమ‌రుగు అయింది. కానీ, ఏపీలో మాత్రం ఓటు బ్యాంకు ప‌రంగా బ‌లంగా ఉంది. 2019 ఎన్నిక‌ల్లో 23 మంది ఎమ్మెల్యేల‌కు ప‌రిమితం అయిన‌ప్ప‌టికీ 40శాతం ఓటు బ్యాంకు ఏపీలో ఉంది. అక్క‌డ క‌నుమ‌రుగు కావ‌డం చాలా క‌ష్టం. అనుకోని ప‌రిణామాలు చోటుచేసుకుంటే మిన‌హా చంద్ర‌బాబు ఏపీలో క‌నుమ‌రుగు కావ‌డం అసాధ్యం.తెలుగుదేశం పార్టీ తెలంగాణ‌లో క‌నుమ‌రుగు కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఓటుకు నోటు కేసు. ఆ కేసులో నిందితుడిగా చంద్ర‌బాబు ఉన్నాడు. ఏ1గా ప్ర‌స్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు క‌థలోని పాత్ర‌ధారిగా ఉన్నాడు. ఆ వ్య‌వ‌హారాన్ని తెలంగాణ ఏసీబీ సీరియ‌స్ గా విచార‌ణ చేసింది. ఆ సంద‌ర్భంగా చంద్ర‌బాబును అరెస్ట్ చేస్తార‌ని టాక్ న‌డిచింది. ఆ కేసుకు ప్ర‌తిగా కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసును ఏపీ పోలీస్ న‌మోదు చేసింది. ఆ కేసును విచారిస్తే కేసీఆర్ ను అరెస్ట్ చేయాల్సి వ‌స్తుంద‌ని బాబు హెచ్చ‌రించాడు. ఆ క్ర‌మంలో వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఒక పెద్దాయ‌న రాజీ కుదిర్చాడట‌. దాని ప్ర‌కారం హైద‌రాబాద్ ను చంద్ర‌బాబు వీడిపోవాలి. తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌క్ష జోక్యం ఉండ‌కూడ‌ద‌ని అంగీకారం. ఆ మేర‌కు బాబు ఆనాడు హుటాహుటిన అమ‌రావ‌తి వెళ్లిపోయాడు. ఫ‌లితంగా టీడీపీ తెలంగాణ‌లో క‌నుమ‌రుగు అయింది.

ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన ప్రతిప‌క్షంగా ఉంది. జ‌గ‌న్ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు పోరాడుతోంది. 2024 ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసుకుని ప‌నిచేస్తోంది. కానీ, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మాత్రం చంద్ర‌బాబు రాజ‌కీయంగా ఇక క‌నుమ‌రుగు అయిన‌ట్టేన‌ని భావిస్తున్నాడు. అదే త‌ర‌హాలో కేసీఆర్ కూడా క‌నుమ‌రుగు అవుతాడ‌ని అంచ‌నా వేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఆయ‌న్ను అరెస్ట్ చేయిస్తామ‌ని బాహాటంగాచెబుతున్నాడు.తెలంగాణ‌లోని కేసీఆర్ ఏడున్న‌రేళ్ల పాల‌నలోని అవినీతిపై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెబుతున్నాడు.ఇలాంటి డైలాగులు ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ తెగ వాడేసింది. గ్రేట‌ర్‌, రంగారెడ్డి- హైద‌రాబాద్‌,-మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆ మేర‌కు ప్ర‌చారం చేసింది. నాగార్జున సాగ‌ర్‌, హుజూర్ న‌గ‌ర్ ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి ఆరోప‌ణ‌లు బీజేపీ చేసింది. కానీ, దుబ్బాక‌, హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో మాత్ర‌మే బీజేపీ విజ‌యం సాధించింది. గ‌త రెండేళ్లుగా కేసీఆర్ అరెస్ట్ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజ‌య్ చెబుతున్నాడు. అవినీతికి సంబంధించిన ఆధారాలు కూడా చాలా ఉన్నాయ‌ని అంటున్నాడు. కాళేశ్వ‌రం నుంచి ప‌లు పంథ‌కాల అమ‌లు సంద‌ర్భంగా భారీగా కేసీఆర్ స‌ర్కార్ అవినీతికి పాల్ప‌డింద‌ని బీజేపీ చేస్తోన్న ఆరోప‌ణ‌. వాటిపై విచార‌ణ జ‌ర‌ప‌డం ద్వారా కేసీఆర్ ను జైలుకు పంపిస్తామ‌ని సంజ‌య్ చెబుతున్నాడు. ట‌చ్ చేసి చూడ‌మ‌ని కేసీఆర్ ప్రతి స‌వాల్ విసిరాడు. అయిన‌ప్ప‌టికీ కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని బీజేపీ ఆ దిశ‌గా అడుగులు వేయ‌డంలేదు. కేవ‌లం మాట‌ల వ‌ర‌కు అరెస్ట్ అంశాన్ని హైలెట్ చేస్తోంది. కార్యాచ‌ర‌ణ విష‌యంలో మాత్రం వెనుక‌డుగు వేయ‌డం చూస్తే బీజేపీ లీడ‌ర్లు చెప్పే మాట‌ల్లో నిజం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. సో..చంద్ర‌బాబు త‌ర‌హాలో కేసీఆర్ రాజ‌కీయంగా క‌నుమ‌రుగు అవుతాడ‌ని సంజ‌య్ చెప్పిన మాట‌లు కేవ‌లం రాజ‌కీయ మైండ్ గేమ్ అనుకోవాలి.