తెలంగాణ(Telangana) బీజేపీ(BJP)లో గత కొన్ని రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాలకు అధ్యక్షులని మార్చింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బండి సంజయ్(Bandi Sanjay) ని తప్పించి కిషన్ రెడ్డికి(Kishan Reddy) అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది బీజేపీ. అయితే ఈ విషయంలో కొంతమంది తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నిరాశ చెందారు. గత మూడేళ్ళుగా బండి సంజయ్ తన దూకుడుతో తెలంగాణాలో బీజేపీకి మంచి స్థానం వచ్చేలా చేశారు. అలాంటిది ఎలక్షన్స్ ముందు ఇలా అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో చాలా మంది బీజేపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
బండి సంజయ్ కూడా ఈ విషయంలో బాధపడినా పార్టీ కోసం నిలబడతాను, కిషన్ రెడ్డికి సహకరిస్తాను అని తెలిపారు. అయితే బండిని పదవి నుంచి తప్పించినందుకు కేంద్ర పదవి ఇస్తారని ఊహా గానాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బండి సంజయ్ నేడు అమిత్ షాని కలిసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
అధ్యక్షపదవి తొలగిన అనంతరం బండి సంజయ్ మొదటి సారి అమిత్ షాని ఢిల్లీలో కలిశారు. అయితే ఈ మీటింగ్ పై ఎలాంటి ప్రకటన లేకుండా కలవడం, వీరి మీటింగ్ తెలంగాణ బీజేపీలో చర్చకి దారి తీసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలసిన బండి సంజయ్ ఆయన్ను సత్కరించారు. అనంతరం అరగంట సేపు మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు అమిత్ షా.
ఈ మీటింగ్ లో.. సంజయ్ కి అమిత్ షా భరోసా కల్పించినట్టు తెలుస్తుంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయమని, క్యాడర్ లో జోష్ నింపాలని, అదే దూకుడు ప్రదర్శించాలని చెప్పినట్టు, తెలంగాణ ఎన్నికల వ్యూహాలపై డిస్కషన్ జరిగినట్లు సమాచారం. దీంతో బండి అభిమానుల్లో కూడా కొంచెం జోష్ వచ్చింది.