తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu Telugu University) పేరును తొలగించిన వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. కరీంనగర్‌లో ఆర్యవైశ్య సంఘం సభ్యులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు దేశ భక్తుడని, స్వాతంత్ర్య పోరాటంలో అనేక త్యాగాలు చేసిన మహనీయుడని కొనియాడారు. హరిజనుల హక్కుల కోసం పోరాడి, ఆలయ ప్రవేశానికి శాసనం చేయించిన గొప్ప వ్యక్తి పేరును తొలగించడం అన్యాయమని, ఇది తెలుగు జాతికి అవమానకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. ఆంధ్రా మూలాలున్న కారణంగా ఆయన పేరును తొలగించారని ఆరోపిస్తూ, అదే విధంగా ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నాయకుల పేర్లు కూడా తొలగిస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రా ప్రజల కోసం పోరాడినప్పటికీ, ఆయన తెలంగాణకు వ్యతిరేకం కాదని, అలాంటి మహనీయుడిని అవమానించడం తగదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకూ, దళితులకు వ్యతిరేకమని ఆరోపిస్తూ, హిందూ సమాజమంతా ఈ వ్యవహారంపై ఆలోచించాలని పిలుపునిచ్చారు.
Amaravathi : అమరావతికి మరో తీపి కబురు
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాలనతో శ్రీలంకలా మార్చుతోందని బండి సంజయ్ విమర్శించారు. 15 నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై భారాన్ని మోపిందని, రాబోయే రోజుల్లో రూ.10 లక్షల కోట్ల అప్పు భారం పెరుగుతుందని హెచ్చరించారు. ఉద్యోగుల జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నా, ప్రభుత్వ హామీలు అమలు చేయకపోయినా, బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం అనవసర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు స్కూటీ, నెలకు రూ.2500 వంటి హామీలు నెరవేర్చితేనే ప్రజలు విశ్వసిస్తారని, కానీ అవినీతి పాలనతో ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు.