Site icon HashtagU Telugu

Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్

Bandi Sanjay (1)

Bandi Sanjay (1)

Bandi Sanjay : బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. శుక్రవారం కరీంనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కుటుంబాల జీవితాలను నాశనం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. “ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా అమలయ్యింది. ఎవరు దీని వెనుక ఉన్నారో ప్రజలకు ఇప్పటికీ స్పష్టంగా అర్థమవుతోంది,” అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసిన బండి సంజయ్, ప్రస్తుతం కొనసాగుతున్న సిట్ విచారణను తూటూ మంత్రంగా అభివర్ణించారు. “ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అనేక కుటుంబాలను టార్గెట్ చేశారు. ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయి ఇప్పుడు సుప్రీం కోర్టు ఊరటతో రాచమర్యాదలు పొందుతున్నాడు,” అని మండిపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, “పెద్దాయన చెప్పాడని చేశాం” అన్న మాటలు మాజీ సీఎం కేసీఆర్‌పై అనుమానాలు పెంచుతున్నాయని బండి సంజయ్ తెలిపారు. “సిరిసిల్లలో జరిగిన కార్యకలాపాల నేపథ్యంలో కేటీఆర్‌ను కూడా విచారించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుమ్మక్కై నిందితులను కాపాడుతున్నాయనేది స్పష్టమవుతోంది,” అని ఆరోపించారు.

సీబీఐకే కేసు బదిలీ చేయాలి

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. “ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సీబీఐ విచారణ హామీ ఇచ్చారు. కేంద్రానికి నేరుగా సీబీఐ దర్యాప్తు చేపట్టే అధికారం ఉంది. అప్పుడే నిజమైన న్యాయం జరుగుతుంది,” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

KTR: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్