Site icon HashtagU Telugu

Bandi Sanjay : తెలంగాణ‌లో `బండి`కి ఢిల్లీ బీజేపీ చెక్

తెలంగాణ‌పై బీజేపీ వినూత్న పంథాను ఎంచుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ్యాధికారం దిశ‌గా ప్లాన్ చేసింది. మునుపెన్న‌డూ లేనివిధంగా ఈసారి తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ నాలుగు క‌స్ట‌ర్లుగా విభ‌జించింది. ఒక్కో క్ల‌స్ట‌ర్ కు ఒక కేంద్ర మంత్రిని ఇంచార్జిగా నియ‌మించింది. స‌ర్వాధికారాల‌ను ఆ న‌లుగురికి క‌ట్ట‌బెట్టింది. రాష్ట్ర‌, జిల్లా, స్థానిక లీడ‌ర్లు ఇంచార్జిల డైరెక్ష‌న్ మేర‌కు న‌డుచుకోవాలి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర క‌మిటీ సైతం ఆ న‌లుగురు చెప్పిన‌ట్టు వినాల్సిందే. దీంతో రాబోవు రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ భ‌విష్య‌త్ ఏమిటి? అనేది ప్ర‌శ్నార్థ‌కం

రాష్ట్రం మొత్తాన్ని నాలుగు క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించిన బీజేపీ 4 నుంచి 5 లోక్ స‌భ నియోజ‌కవ‌ర్గాల‌ను ఓ క్ల‌స్ట‌ర్ గా ఎంపిక చేసింది. ఆయా క్ల‌స్ట‌ర్ల‌కు ఎన్నిక‌ల్లో న‌లుగురు ఇంచార్జీలే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లుగా స‌మాచారం. పార్టీ టిక్కెట్ల కేటాయింపు, బూత స్థాయి లీడ‌ర్ల‌తో కో ఆర్డినేష‌న్ త‌దిత‌రాల‌ను స్వయంగా ప‌రిశీలించ‌నున్నారు. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, జ‌హీరాబాద్ క్ల‌స్ట‌ర్లుగా మొత్తం రాష్ట్రాన్ని విభ‌జించింది. హైద‌రాబాద్ క్ల‌స్ట‌ర్‌కు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియాను ఇంచార్జీగా నియ‌మించింది. జ‌హీరాబాద్ క్ల‌స్ట‌ర్ బాధ్య‌త‌ల‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్‌కు అప్ప‌గించింది. ఆదిలాబాద్ క్ల‌స్ట‌ర్‌కు మ‌రో కేంద్ర మంత్రి పురుషోత్త‌మ్ రూపాల‌ను, వ‌రంగ‌ల్ క్ల‌స్ట‌ర్‌కు రావు ఇంద్ర‌జిత్ సింగ్‌ను నియ‌మించింది. ఆ న‌లుగురు తెలంగాణ బీజేపీ వ్య‌వ‌హారాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకుంటారు.

సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్లో నిర్వ‌హించిన జాతీయ కార్య‌వ‌ర్గ‌ముగింపు స‌క్సెస్ త‌రువాత రాజ్యాధికారం దిశ‌గా బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆ క్ర‌మంలో వినూత్నంగా ముందుకు క‌దులుతోంది. బ‌హిరంగ స‌భ ను విజ‌య‌వంతం చేసిన బండి సంజ‌య్ ను భుజంత‌ట్టి శ‌భాష్ అంటూ ప్ర‌శంసించిన మోడీ రెండు రోజులు తిర‌గ‌కుండానే తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌కు అప్ప‌గించారు. రాబోవు రోజుల్లో బండి సంజ‌య్ సైతం ఆ నలుగురు కనుస‌న్న‌న‌లో న‌డవాల్సిందేనంటూ బీజేపీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలంగాణ బీజేపీలో అంత‌ర్గ‌తంగా విభేదాలు ర‌గిలిపోతున్నాయి. ఇటీవ‌ల బండి సంజ‌య్ మీద ఒక గ్రూపు క‌రీంన‌గ‌ర్ కేంద్రంగా నిర‌స‌న వ్య‌క్తం చేసింది. ఢిల్లీకి వెళ్లి ఆయ‌న‌పై పంచాయ‌తీ పెట్టారు. ఆ సంద‌ర్భంగా పెద్ద‌లు స‌యోధ్య కుద‌ర్చ‌డంతో పాటు బండికి అండ‌గా నిలిచారు. అయిన‌ప్ప‌టికీ బండి వ్య‌తిరేక గ్రూప్ ర‌హ‌స్య స‌మావేశాల‌ను నిర్వ‌హించుకుంటూ పావులు క‌దుపుతోంది. రాష్ట్ర బీజేపీలోని సీనియ‌ర్ల మ‌ధ్య పొస‌గ‌డంలేదు. పైకి అంద‌రూ ఐక్యంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ లోప‌ల ఎవ‌రికివారే రాజ‌కీయం న‌డుపుతున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇలాంటి పరిణామాల‌కు చెక్ పెట్టేలా క్ల‌స్ట‌ర్ వ్యూహాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చిన ఢిల్లీ బీజేపీ అగ్ర‌నేత‌లు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండికి బ్రేక్ వేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.