Site icon HashtagU Telugu

Bandi Sanjay: ఇంకెన్నాళ్లు ‘టీఆర్ఎస్’ అరాచక పాలనను భరిద్దాం? – బండి సంజయ్’..!

Bandi Imresizer

Bandi Imresizer

‘‘భారతీయ జనతా పార్టీకి అసలు సిసలైన బాస్ లు మీరే… రాష్ట్రంలో అవినీతి-నియంత-కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మీరు సాగిస్తున్న పోరాటాలవల్లే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదిగింది. టీఆర్ఎస్ మూర్ఖపు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేస్తున్నా…మరెన్ని కేసులు పెడుతున్నా…జైళ్లకు పంపుతున్నా భయపడకుండా ఎదురొడ్డి పోరాడుతున్నారు. రాష్ట్రంలో ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనే భావన ప్రజల్లో ఏర్పడిందంటే మీరు చేస్తున్న ఉద్యమాలే కారణం.

ఈ నేపథ్యంలో ఈనెల 14న తుక్కుగూడలో జరగబోయే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ తెలంగాణలో మార్పుకు సంకేతం కాబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రాబోతున్న ఈ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేద్దాం. ఈ సభకు మీతో పాటు మీ పోలింగ్ బూత్ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, పార్టీ అభిమానులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకోండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఈనెల 14న జరగబోయే పాదయాత్ర ముగింపు సభ విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జన సమీకరణపై ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన దాదాపు 10 వేల మంది పోలింగ్ బూత్ అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘ఈరోజు కేంద్రంతోపాటు 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే… పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు చేసిన కృషియే కారణం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పోలింగ్ బూత్ అధ్యక్షులే కారణమని సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ కూడా పలుమార్లు చెప్పిన విషయం గుర్తుంచుకోండి’’అని చెప్పారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందని, జనం పెద్ద ఎత్తున తరలివచ్చి సమస్యలు చెప్పుకున్నారని పేర్కొన్నారు. పాలమూరు ఎడారిగా మారిందని, చుక్క నీరు లేదని, ఉండటానికి నిలువ నీడలేక అరిగోస పడుతున్న దృశ్యాలే కన్పించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, ఈ దుస్థితి పోవాలంటే కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటంతోపాటు బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంద్నారు.

ప్రజల్లో బీజేపీకి అధికారం ఇవ్వాలనే చర్చ జరుగుతోందని… ఈ నేపథ్యంలో మార్పుకు సంకేతంగా నిలిచేలా కనీవినీ ఎరగని రీతిలో పాదయాత్ర ముగింపు సభకు కనీవినీ ఎరగని రీతిలో భారీ ఎత్తున జనాన్ని సమీకరించి సక్సెస్ చేయాలని కోరారు. పాదయాత్ర సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా నేతలతో పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద బండి సంజయ్ ప్రత్యేకంగా సమావేశమై పాదయాత్రకు భారీ ఎత్తున జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

Exit mobile version