Site icon HashtagU Telugu

BJP Challenges AIMIM: ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం.. MIMకు ‘బండి’ ఛాలెంజ్!

Bjp And Mim Kcr

Bjp And Mim Kcr

తెలంగాణ (Telangana) రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. వచ్చే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని ఇప్పట్నుంచే కార్యాచరణను రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలోని 119 స్థానాల్లో తమ పార్టీ కనీసం 50 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఎంఐఎం పార్టీకి సవాల్ విసిరారు. తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)కి సవాలు విసిరారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ సేవాదళ్ ఆధ్వర్యంలో కార్వాన్ హనుమాన్ దేవాలయం వద్ద శోభాయాత్రలో బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) పాల్గొన్నారు. ‘‘మేం ఏఐఎంఐఎం పార్టీకి సవాలు విసిరాం. మీకు దమ్ము ఉంటే, ఇస్లాం మతాన్ని ప్రబోధిస్తే, ముస్లింల కోసం పనిచేస్తున్నారని భావిస్తే తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేయండి. మీకు డిపాజిట్లు రాకుండా మేం బాధ్యత తీసుకుంటాం. మీరు భారత రాష్ట్ర సమితి (BRS) లేదా  కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసుకోవచ్చు. మీరు నక్కల గుంపుతో రావచ్చు. కానీ సింహం ఒంటరిగా వస్తుంది. బీజేపీ కూడా ఒంటరిగా వస్తుంది’’ అని బండి సంజయ్ అన్నారు.

భాగ్యనగర్ (ఇప్పుడు హైదరాబాద్) యువత ఎఐఎంఐఎం ఛాలెంజ్‌ను గమనించాలని అని అన్నారు. ‘‘ఏఐఎంఐఎం ఏం చేస్తుందో ప్రతిఒక్కరు నిశితంగా పరిశీలించాలి. వీరికి మద్దతిచ్చే సెక్యులర్ శక్తులు ఏం చేస్తున్నారో చూడాలి. హిందువులు ఏకమైతే భాగ్యనగరంలో హిందూ సమాజం శక్తివంతమైన శక్తిగా మారుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల సమయంలో హిందూ ఐక్యత ఎలా కనిపించిందో, వచ్చే ఎన్నికల్లో భాగ్యనగర యువత తమ సత్తా చాటాలి’’ అని (Bandi Sanjay) అన్నారు. కాగా 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని గతంలో ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. GHMC ఎన్నికలలో లెక్కకు మించి స్థానాలు గెలుపొందడంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవడానికి బిజెపి ఎటువంటి అవకాశాన్ని వదలడం లేదు. అయితే సంక్షేమ పథకాలు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల కారణంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ (BRS) మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గతంలో ఓ సర్వేలో వెల్లడైంది. అయితే అధికార పార్టీకి సీట్ల వాటా తగ్గవచ్చని అంచనా వేసింది.

Also Read: CM KCR: కేసీఆర్ దూకుడు.. దేశవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు!