President’s Rule: బండి అరెస్ట్ ఎఫెక్ట్.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన?

బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Written By:
  • Updated On - April 5, 2023 / 04:20 PM IST

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహరం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గత రెండు రోజులుగా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అటు అధికార వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. పోలీసులు సంజయ్ అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన వందలాది మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఆయన్ను యాదాద్రి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ భారీ సంఖ్యలో బిజెపి కార్యకర్తలు ధర్నాకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ధర్నాలు నిర్వహించి అరెస్ట్‌ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఎం రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లను అరెస్టు చేయడం, పలువురు బిజెపి నాయకులను గృహనిర్బంధం చేయడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.

‘వారెంట్ లేకుండా అర్ధరాత్రి తర్వాత తనను అరెస్టు చేశారని’ సంజయ్ లోక్‌సభ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, బీజేపీ న్యాయ బృందం అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించగా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీశారు. బండి సంజయ్‌పై దాఖలైన కేసులపై తనకు ఎలాంటి సమాచారం లేదని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ తనకు సమాధానం ఇచ్చిన తీరుపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

“ఇది అత్యంత బాధ్యతారహితమైన పోలీసింగ్” అని ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు, నాయకుల అరెస్టులు, నాయకుల మాటల తూటాల కారణంగా తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చర్చకు దారితీసింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులతో సహా బీజేపీ నేతల బృందం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని డిమాండ్ చేయనుంది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేంద్రం గవర్నర్ నుండి నివేదికను కూడా కోరుతుందని, ఆమె నివేదికను బట్టి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై కేంద్రం పిలుపునిచ్చే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

Also Read: CM KCR: చారిత్రాత్మక వేడుకగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం: కేసీఆర్