Site icon HashtagU Telugu

Group 1 Exam : గ్రూప్‌-1 అభ్యర్థుల మీద లాఠీచార్జి చెయడంపై బండి సంజయ్ ఆగ్రహం

Candidates Protest At Ashok

Candidates Protest At Ashok

గ్రూప్‌-1 పరీక్ష (Group 1 Exam) రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతూ అశోక్ నగర్ (Ashok Nagar) లో అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ (Police Lathi Charge) చేయడం తో పలువురికి గాయాలు అయ్యాయి. దీనిపై కంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సీరియస్ అయ్యారు.

ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రెండు రోజులుగా ఆందోళనలు తీవ్రతరం చేశారు. నిన్న రాత్రికి కూడా ధర్నా చేయడం తో పోలీసులు చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కూడా అలాగే డిమాండ్ చేస్తూ రోడ్లపైకి చేరుకుని నినాదాలు చేస్తు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో చేరుకున్న అభ్యర్ధులు గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కాగా గ్రూప్ 1 అభ్యర్థులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్‌-1 అభ్యర్థులు పలువురు కరీంనగర్‌లోని బండి సంజయ్‌ నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయడంలో తమకు సాయం చేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రూప్స్ అభ్యర్థుల ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. న్యాయం కోరితే రక్తం కళ్లజూస్తారా అని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు జీవో 29 గొడ్డలి పెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రూప్‌ – 1 అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ -1 పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అశోక్‌ నగర్‌ నుంచి ఉద్యమం తెలంగాణ అంతా వ్యాపిస్తుందని హెచ్చరించారు.

Read Also : Morning Breakfast : పాలను ఉపయోగించకుండా మీరు చేయగలిగే 9 ఆరోగ్యకరమైన ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ వంటకాలు..!