Bandi: అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష… రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న కేసీఆర్ ను గద్దె దించుతాం – బండి సంజయ్’

‘‘ప్రపంచమే గర్వించదగ్గ రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలబెట్టిన గొప్ప వ్యక్తి. ఈ దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే రక్ష.

  • Written By:
  • Updated On - April 14, 2022 / 01:07 PM IST

‘‘ప్రపంచమే గర్వించదగ్గ రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలబెట్టిన గొప్ప వ్యక్తి. ఈ దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే రక్ష. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానిస్తున్న పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరగరాయలన్న కేసీఆర్ అవినీతి-కుటుంబ-అరాచక-నియంత పాలనకు చరమ గీతం పాడేందుకే ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేస ఘనంగా నివాళులు అర్పించారు.

అంబేద్కర్ కు నివాళి అర్పించిన వారిలో బండి సంజయ్ తోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే పార్టీ తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, రఘు నందన్ రావు, మాజీమంత్రి సుద్దాల దేవయ్య,, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాములు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గీతామూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.సంగప్ప, అశోక్, అందెల శ్రీరాములు యాదవ్ తదితరులున్నారు. రాజ్యాంగ నిర్మాత, మనందరి స్పూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు నా శుభాకాంక్షలు.

అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకుని వారి చరిత్రను, వారి గొప్పతనాన్ని దేశ ప్రజలకు అందజేయాలని బీజేపీ ఎంతగానో క్రుషి చేస్తోందని అన్నారు బండి సంజయ్. ప్రపంచమే మెచ్చుకునేంతటి అతి పెద్ద ప్రజాస్వామ్య భారత్ కు పునాదలు వేస్తూ రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్న పార్టీ బీజేపీ. నేను ప్రధాని అయ్యానంటే… అది అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం పెట్టిన భిక్ష అని పార్లమెంట్ లో ప్రకటించిన వ్యక్తి నరేంద్రమోదీనే అని వెల్లడించారు బండి సంజయ్. అంబేద్కర్ చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉధ్దేశంతోనే పంచతీర్థాలను అభివృద్ధి చేసిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.

అంబేద్కర్ స్పూర్తితో పాలిస్తున్న పార్టీ బీజేపీ…ఎంతో మంది దళితులకు ఉన్నత పదవులు కట్టబెట్టిన పార్టీ బీజేపీ.బీజేపీ అంబేద్కర్ స్పూర్తితో పనిచేస్తుంటే… ఆయన ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తున్న పార్టీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అని విమర్శించారు బండి సంజయ్. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించడంతోపాటు ఎంపీ గా పోటీ చేస్తే ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్. అంబేద్కర్ జయంతి, వర్దంతులకు హాజరుకాని ఏకైక సీఎం కేసీఆరే అని విమర్శించారు బండి సంజయ్.

కనీసం ఈరోజైనా అంబేద్కర్ ను తలుచుకుంటే మంచి బుద్ది వస్తుందని కేసీఆర్ కు సూచిస్తున్నా. అంబేద్కర్ ను కొలిస్తే దళితులకు ఇచ్చిన హామీలన్నీ గుర్తుకొస్తాయని ఆశిస్తున్నా. అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచానికే స్పూర్తి… కానీ కేసీఆర్ మాత్రం ఆ రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానంటూ.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెస్తానంటూ ఆహంకారంతో మాట్లాడుతున్నారు. బీజేపీ ఎన్నటికీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఒప్పుకోదు. ఆ ఆలోచననే చంపేస్తాం. అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష. ఆ స్పూర్తితోనే కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది అని వెల్లడించారు బండి సంజయ్.