Site icon HashtagU Telugu

Balakrishna : తెలంగాణకు రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన బాలకృష్ణ

Balakrishna

Balakrishna

Balakrishna : తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అనేక జిల్లాల్లో పంటలు నాశనం కావడంతో పాటు ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా సంభవించింది. ఈ క్రమంలో సినీ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటిసారి స్పందించారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి తన సహృదయాన్ని చాటుకున్నారు.

ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఈ సందర్భంగా ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. “వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు, ఆస్తులు నాశనం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో నా వంతు సహాయంగా ఉడతాభక్తిగా రూ.50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నాను. ఇకముందు కూడా సహాయ కార్యక్రమాల్లో భాగమవుతాను” అని బాలకృష్ణ అన్నారు.

Sudarshan Chakra : ‘సుదర్శన చక్ర’ గేమ్ ఛేంజర్ అవుతుంది – రాజ్‌నాథ్ సింగ్

సినీ పరిశ్రమ నుంచి ముందుగా స్పందించిన సందీప్ రెడ్డి వంగా

వర్షాల కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులపై సినీ పరిశ్రమ నుంచి ముందుగా స్పందించిన వారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే. ఆయన ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షల విరాళం అందించారు. ఇప్పుడు బాలకృష్ణ విరాళం ప్రకటించడంతో సినీ ప్రముఖులు ఒకరొకరుగా ముందుకు వస్తారని భావిస్తున్నారు.

వర్షాల వల్ల తెలంగాణలో విధ్వంసం

తెలంగాణలో కురిసిన కుండపోత వర్షాలకు మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి చెరువులు తెగిపోవడంతో అనేక గ్రామాలు మునిగిపోయాయి. రవాణా వ్యవస్థ దెబ్బతింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రహదారులు చెదిరిపోయి గ్రామాల మధ్య కనెక్టివిటీ దెబ్బతింది. వేలాది ఎకరాల్లో పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలోని 28 జిల్లాల్లో మొత్తం 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాంతో పాటు సుమారు 1,43,304 మంది రైతులు నష్టపోయారు.

అత్యధిక నష్టం కామారెడ్డులో

జిల్లాల వారీగా పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లాలోనే 77,394 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. తరువాత మెదక్‌లో 23,169 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 21,276 ఎకరాలు, నిజామాబాద్‌లో 18,417 ఎకరాలు, కొమురం భీం ఆసిఫాబాద్‌లో 15,317 ఎకరాలు పంటలు నాశనం అయ్యాయి. ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.

రైతులకు ఊరటనిచ్చే సహాయం అవసరం

భారీ వర్షాలు, వరదలతో మట్టికరిపిన రైతులు ఇంత పెద్ద నష్టాన్ని భరించే స్థితిలో లేరు. రాష్ట్ర ప్రభుత్వం, సాయం చేయడానికి ముందుకు వచ్చిన సినీ ప్రముఖులు కలసి రైతులకు ఆర్థిక ఊరటనిచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. బాలకృష్ణ విరాళం ఈ దిశగా మరో సానుకూల అడుగుగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశ‌ప‌డిన ట్రంప్‌.. భారీ షాక్ ఇచ్చిన భార‌త్‌!