Revanth Reddy :తెలంగాణ కాంగ్రెస్‌లో పెనుదుమారం..రేవంత్ కు షోకాజ్ నోటీస్‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా వ్యాఖ్య‌లు ఆ పార్టీకి త‌ల‌నొప్పి తెచ్చాయి.

  • Written By:
  • Updated On - May 24, 2022 / 03:44 PM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా వ్యాఖ్య‌లు ఆ పార్టీకి త‌ల‌నొప్పి తెచ్చాయి. పీసీసీ చీఫ్ ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని కాంగ్రెస్ లీడ‌ర్ బండ్ల గ‌ణేష్ ట్వీట్ చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌డ్స‌న్ డిమాండ్ చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి షోకాజ్ నోటీసు పంప‌డం సంచ‌ల‌నంగా మారింది. సీనియ‌ర్లు మౌనంగా ఉంటూ అధిష్టానంకు ఫిర్యాదులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప‌రువు తీస్తూ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి రాజ్యాధికారం కావాల‌ని రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు మిగిలిన వ‌ర్గాల‌ను కించ‌ప‌ర‌డ‌మేన‌ని దుయ్య‌బ‌డుతున్నారు. అంతేకాదు, పార్టీల‌న్నీ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి నాయ‌కత్వాన్ని అప్ప‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

రెడ్డి కులాన్ని వెనుకేసుకొస్తూ రేవంత్ రెడ్డి చేసిన‌ వ్యాఖ్యలపై పలువురు నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కేసీఆర్ సర్కారుపై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి సడెన్ గా కులాల ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అధికారం కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదనలు లేక‌పోలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ వెలమ రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చాయి. తాజాగా రెడ్డి కులం గొప్పతనం గురించి చెప్పుకొచ్చిన రేవంత్… ఉమ్మడి రాష్ట్రంలో 10 మంది ముఖ్యమంత్రులు రెడ్డి కులస్థులేనన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి రెడ్డికి 10ఎకరాలు ఉన్నప్పుడే రాజ్యం, రాజకీయం రెడ్ల చేతుల్లో ఉంటుందని చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుని పేదలకు సాయం చేసి రెడ్ల గౌరవాన్ని పెంచుకోవాలని సూచించారు. రెడ్లను నమ్ముకున్న వాళ్లు ఎవరూ మోసపోలేదని, పార్టీలు గెలవాలంటే రెడ్లకే పార్టీల పగ్గాలు అప్పజెప్పాలని అన్నారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టి వెలమలైన పద్మనాయకులను దగ్గరికి తీశాడని అందుకే కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. కులం పేరు చెప్పుకుని కొందరు రాజ్యాన్ని ఏలాలని భావిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేస్తేనే విజయం వరిస్తుందని, కులాలు, మతాలతో గెలిచిన చరిత్ర ఇప్పటి వరకు లేదని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టడం తగదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. మరోవైపు రేవంత్ రెడ్డి తన వ్యాఖ్య‌ల‌తో జ‌య‌శంక‌ర్‌ ను అవమానించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్య‌బ‌ట్టారు.

సామాజిక ఈక్వేష‌న్ కోణంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ ను ప్ర‌శ్నార్థకం చేశాయ‌ని ఆ పార్టీ లీడ‌ర్లు భావిస్తున్నారు. నోటుకు నోటు కేసు సంద‌ర్బంలోనూ ఆయ‌న స‌బాస్టియ‌న్ తో సంభాషించిన‌ప్పుడు రెడ్డి కులాన్ని గురించి ప్ర‌స్తావించారు. ఆ విష‌యాన్ని గుర్తు చేస్తూ ఆ రోజు నుంచి ఆయ‌న‌కు ఉన్న కులపిచ్చి వ్య‌వ‌హారాన్ని ఇప్పుడు వేదిక‌ల‌పై తీసుకొచ్చార‌ని రేవంత్ వ్య‌తిరేకులు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద స్వ‌ప‌క్షంలోని రేవంత్ వ్య‌తిరేకులు, ప్ర‌త్య‌ర్థి పార్టీలు మూకుమ్మ‌డిగా రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లపై విరుచుకుప‌డుతున్నారు. ఆ క్ర‌మంలో ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి అధికారాల‌ను క‌త్తిరించే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. అంతేకాదు, ఆయ‌న్ను పీసీసీ చీఫ్ గా బ‌ర్త‌ర‌ఫ్ చేస్తార‌ని కొంద‌రు కాంగ్రెస్ లోని వ్య‌తిరేక గ్రూప్ చెబుతోంది. నిజంగా అలాంటి సాహ‌సం ఏఐసీసీ చేస్తుందా? అనేది చూడాలి.