TRS MLA Poaching Case : ఫామ్ హౌస్ డీల్‌ కేసు నిందితుల‌కు బెయిల్‌, జైలు నుంచి ఒక‌రే బ‌య‌ట‌కు..!

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, సింహయాజీ మాత్రమే గురువారం బయటకు రానున్నారు.

  • Written By:
  • Updated On - December 1, 2022 / 01:00 PM IST

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, సింహయాజీ మాత్రమే గురువారం బయటకు రానున్నారు. మిగిలిన ఇద్ద‌రు రామచంద్ర భారతి, నందులపై బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్లో కేసులు ఉన్నాయి. ఆ కేసుల క్ర‌మంలో ఇద్ద‌రూ రిమాండ్ లో ఉన్నారు. ఆయా కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ త‌రువాత మాత్ర‌మే రామ‌చంద్ర‌భార‌తి, నందు జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులైన ముగ్గురుకి గురువారం తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులైన నందు, సింహయాజీ, రామచంద్ర భారతి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వాళ్ల‌కు బెయిల్ ఇచ్చింది. ప్ర‌స్తుతం సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో విచారణకు సహకరించాలని షరతు విధించింది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేయాలని ఆదేశించింది. ఒక్కొక్క‌రు రూ. 2 లక్షల చొప్పున ముగ్గురు క‌లిసి రూ. 6 లక్షల పూచీకత్తును సమర్పించాలని తెలిపింది. పాస్ పోర్టులను పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలని నిందితుల‌ను ఆదేశించింది.

మరోవైపు కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు లాయర్ తన వాదనలను వినిపించారు. నిందితులు బెయిల్ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంద‌ని వాదించారు. ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. నిందితుల నేచ‌ర్ ను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ను నిరాకరించాలని కోర్టును కోరారు. ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను విన్న త‌రువాత నిందితులు ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.