Babu Mohan : సినీ కమెడియన్, మాజీ మంత్రి బాబుమోహన్.. కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ నుంచి ఖచ్చితంగా లోక్‌సభకు పోటీ చేస్తానని.. ఎంపీగా గెలుస్తానని బాబు మోహన్ గతంలో పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ నుంచి ప్రజాశాంతి పార్టీలోకి చేరడం ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. వరంగల్ లోక్‌సభ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నో చెప్పడంతో బాబు మోహన్ (Babu Mohan) ప్రజాశాంతి పార్టీలో చేరారని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బాబు మోహన్ ఓడిపోయారు. ఆందోల్ సీటు కేటాయింపులోనే బీజేపీ నేతలతో తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తగా.. ఆ ఎన్నికల్లో బాబు మోహన్ ఓటమి పాలయ్యారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలపొందారు. బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవలె బీజేపీపై, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన బాబు మోహన్.. ఎట్టకేలకు ఫిబ్రవరి 7న బీజేపీకి రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరుతాననే దానిపై త్వరలోనే నిర్ణయం వెలువరిస్తానని పేర్కొన్న బాబు మోహన్.. తాజాగా ప్రజాశాంతి పార్టీ కండువాను కప్పుకున్నారు.
Also Read :Muthu Song : ‘ముత్తు’ పాటను పాడుతూ జపాన్ పెద్దాయన డ్యాన్స్.. వీడియో వైరల్
బీజేపీని వదిలే క్రమంలో బాబు మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కంపు నుంచి బయటకి రావాలనుకున్నా.. వచ్చేశా’’ అని చెప్పారు. ‘‘బీజేపీ ఓడాలని చూస్తున్నారు.. వీళ్లేం లీడర్లు.. ఇలాంటి నేతలను నేను ఏ పార్టీలోనూ చూడలేదు’’ అని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘బీజేపీ వాళ్లకు వెదవలు కావాలి కానీ.. బాగా పనిచేసే వారు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవాలి’’ అని బాబూ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘నన్ను వాడుకొని బీజేపీ వదిలేసింది. బీజేపీ నేతలు పొమ్మనలేక పొగబెడుతున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.