హైదరాబాద్‌లోని మహా న్యూస్ కార్యాలయం (Mahaa News Office) వద్ద శనివారం ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ప్రసారం చేసిన కథనాల్లో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించడంపై BRS కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. వారు ఆగ్రహంతో ఆఫీసు వద్దకు చేరుకుని అద్దాలు పగలగొట్టడం, వాహనాలు ధ్వంసం చేయడం, స్టూడియోలోకి ప్రవేశించి పరికరాలు నాశనం చేయడం వంటి చర్యలకు దిగారు. ఈ అల్లర్ల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో #ktr పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేసి, స్టూడియోను ధ్వంసం చేసిన #BRSParty కార్యకర్తలు. #HashtagU pic.twitter.com/34VU91IB8L
— Hashtag U (@HashtaguIn) June 28, 2025
ఈ దాడి సమయంలో మాహాన్యూస్ స్టూడియోలో ప్రముఖ యువ హీరో సుహాస్ (Suhas) కూడా ఉన్నారు. ఆయన తన తాజా సినిమా ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu) ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కానీ అకస్మాత్తుగా జరిగిన ఈ ఘర్షణతో ఆందోళన చెందిన సుహాస్, తక్షణమే ఆఫీసు నుంచి బయటకు వెళ్లిపోయారు. ఒక మీడియా సంస్థ ఆఫీసులోనే ఇలాంటి ఉద్రిక్తతలు జరగడం చూసి ప్రజలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఘటనకు సంబంధించి పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తేవడంతో పాటు, అల్లర్లు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై మరోసారి ప్రశ్నలు రేపింది. చర్చలు, అభిప్రాయ భేదాల వల్ల ఏర్పడే రాజకీయ అసహనం ఈ స్థాయికి చేరడం ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మీడియా తప్పు చేస్తే న్యాయపరమైన మార్గాలు ఉన్నాయి కానీ హింసతో స్పందించడం ఏ విధంగానూ సమర్థించదగినది కాదు.