Site icon HashtagU Telugu

ASK KTR : ‘ఆస్క్ కేటీఆర్’ ఔట్?

Ktr Revanth

Ktr Revanth

మంత్రి కేటీఆర్ నిర్వ‌హిస్తోన్న `ఆస్క్ కేటీఆర్` సోష‌ల్ మీడియా ప్రోగ్రామ్ అభాసుపాలు అయింది. ఆ వేదిక‌గా నెటిజ‌న్లు వేసిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇవ్వ‌లేక నీళ్లు న‌మిలాడు. అంతేకాదు, ఆయ‌న విసిరిన స‌వాల్ కు రేవంత్ చేసిన‌ ప్ర‌తిస‌వాల్ నుంచి తెలివిగా త‌ప్పుకున్నాడు. ద‌ళిత బంధు గురించి నెటిజ‌న్లు నిల‌దీశారు. ఎప్ప‌టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తారో..చెప్ప‌లేక‌పోయాడు. సాదాసీదా ప్ర‌శ్న‌ల‌కు మాత్ర‌మే జ‌వాబు ఇచ్చిన కేటీఆర్ సూటిగా నిల‌దీసిన నెటిజ‌న్ల‌కు సంతృప్తిక‌ర‌మైన స‌మాధానాలు ఇవ్వలేక‌పోయాడు. దీంతో ఇక భవిష్య‌త్ లో ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రామ్ ఉంటుందా? ఉండ‌దా? అనే సందేహం మొద‌లైయింది.ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నానంటూ 2018 అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందే చెప్పాడు. మీడియాముఖంగా ఆయ‌న మ‌దిలోని ఆలోచ‌న వెలుబుచ్చాడు. అందుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ కూడా సిద్ధం అవుతుంద‌ని చెప్పాడు. అప్ప‌ట్లో ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒరిస్సా, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క , జార్ఖండ్ , ఢిల్లీ రాష్ట్రాల్లోని సీఎంలు, ప్ర‌తిప‌క్ష పార్టీల అధినేత‌ల‌తో భేటీ అయ్యాడు. అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత సైలెంట్ అయ్యాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర కూట‌మి దిశ‌గా వెళ్లాల‌ని మంత‌నాలు సాగిస్తున్నాడు. ఆ క్ర‌మంలో ఇటీవ‌ల సీపీఐ, సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో భేటీ అయ్యాడు. బీహార్ కు చెందిన లాలూ కుటుంబం కూడా కేసీఆర్ ను క‌లిసింది. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ తో ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయిన విష‌యం విదిత‌మే. ఇవ‌న్నీ జాతీయ రాజ‌కీయాల వైపు వెళ్ల‌డానికి కేసీఆర్ చేస్తోన్న ప్ర‌య‌త్నాలు.

ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నాన‌ని కేసీఆర్ చెబుతుంటే, కేటీఆర్ మాత్రం జాతీయ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ వెళ‌తారా? అనే నెటిజ‌న్ వేసిన ప్ర‌శ్న‌కు ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రామ్ లో స‌రైన స‌మాధానం చెప్ప‌లేదు. ఇక హుజూరాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ఆర్భాటంగా తెలంగాణ స‌ర్కార్ ప్రారంభించింది. అమ‌లు సాధ్యంకాద‌ని ఆనాడే విప‌క్షాలు నెత్తినోరు బాదుకున్నాయి. కానీ, ఆ ప‌థ‌కాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేసి చూపుతాన‌ని కేసీఆర్ బ‌ల్ల‌గుద్ది చెప్పాడు. ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాత ఆ ప‌థ‌కం చ‌తికిల‌ప‌డింది. తెలంగాణ వ్యాప్తంగా ఎప్ప‌టి నుంచి అమ‌లు చేస్తారో..చేప్ప‌లేని ప‌రిస్థితి. స‌రిగ్గా ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రామ్ లో ఈ ప‌థ‌కం అమ‌లు గురించి నెటిజ‌న్ ప్ర‌శ్న సంధించాడు. దానికి కేటీఆర్ నుంచి స‌మాధానం లేదు.

ఏడేళ్లుగా తెలంగాణ స‌ర్కార్ చేసిన అభివృద్ధి మీద ఎవ‌రితోనైనా బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ఇటీవ‌ల కేటీఆర్ స‌వాల్ విసిరాడు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడ బండి సంజ‌య్ ను జైలుకు పంపిన త‌రువాత ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ఛాలెంజ్ చేశాడు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు అంద‌క‌పోయిన‌ప్ప‌టికీ తెలంగాణ అభివృద్ధి. జ‌రిగిన తీరును వివ‌రించాడు. దానిపై చ‌ర్చ‌కు రెడీ అంటూ స‌వాల్ విసిరాడు. ఆ స‌వాల్ ను స్వీక‌రించాల‌ని విప‌క్షాల‌కు పిలుపునిచ్చాడు. దీంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ స‌వాల్ ను స్వీక‌రించాడు. ఏడేళ్ల కేసీఆర్ పాల‌న‌లో జ‌రిగిన అభివృద్ధి ఎంటో తేల్చేందుకు చ‌ర్చ‌కు సై అన్నాడు. అందుకోసం ఓ మీడియా హౌస్ ను కేంద్రంగా నిర్ణ‌యించుకుందామ‌ని కూడా చెప్పాడు. ఇదే విష‌యాన్ని ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రామ్ లో ఓ నెటిజ‌న్ లేవ‌నెత్తాడు. రేవంత్ ఒక క్రిమిన‌ల్‌..అలాంటి 420 గాళ్ల‌తో చ‌ర్చ‌కు వెళ్ల‌న‌ని ఆ వేదిక‌పై చెప్ప‌డం నెటిజ‌న్ల‌కు ఆగ్ర‌హం క‌లిగించింది.
వ‌రి ధాన్యం కొనుగోలు, జీవో నెంబ‌ర్ 317, నిరుద్యోగ భృతి, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఉద్యోగ‌, ఉపాథి క‌ల్ప‌న, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, ఎరువుల ఉచిత పంపిణీ త‌దిత‌ర అంశాల‌పై నెటిజ‌న్లు కేటీఆర్ ను ఆడుకున్నారు. సూటిగా స‌మాధానాలు ఇవ్వ‌లేక నీళ్లు న‌మిలిన ఆయ‌న ఇక `ఆస్క్ కేటీఆర్` ప్రోగ్రామ్ ను క్లోజ్ చేస్తాడ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు ట్రోల్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.