New Criminal Bills : కొత్త క్రిమినల్ బిల్లులపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు ప్రతిపాదిత క్రిమినల్ చట్టాల వల్ల దేశంలోని ముస్లింలు, దళితులు, ఆదివాసీలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీల్లో 30 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జైళ్లలో ఉన్న ఖైదీల్లో 33 శాతం మంది ముస్లిం వర్గానికి చెందినవారు ఉన్నారు’’ అని ఒవైసీ ఆరోపించారు. కొత్త క్రిమినల్ బిల్లులలో ప్రజలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు విస్తృత అధికారాలను కల్పిస్తున్నందున పౌర స్వేచ్ఛ, హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. ఆ బిల్లులపై మంగళవారం లోక్‌సభలో చర్చ మొదలైన సందర్భంగా ఒవైసీ ఈ కామెంట్స్ చేశారు. ఈ మూడు ప్రతిపాదిత క్రిమినల్ కోడ్ బిల్లులు ఇండియన్ పీనల్ కోడ్ – 1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ – 1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872లను రీప్లేస్ చేయనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
మూడు ప్రతిపాదిత క్రిమినల్ చట్టాలలో ప్రమాదకరమైన అనేక నిబంధనలు ఉన్నాయని మజ్లిస్ చీఫ్ తెలిపారు. న్యాయమూర్తిగా, జ్యూరీగా, కార్యనిర్వాహకుడిగా వ్యవహరించడానికి ఈ కొత్త చట్టాలు పోలీసులకు విస్తృత అధికారాలను కల్పిస్తాయని ఆవేదన వెలిబుచ్చారు. ప్రతిపాదిత బిల్లుల్లో దేశద్రోహ శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచారని పేర్కొన్నారు. అత్యాచారం నేరాన్ని లింగ భేదం లేకుండా చేయాలని ఒవైసీ(New Criminal Bills) డిమాండ్ చేశారు.
Also Read: PM Modi – Pannun : పన్నూ హత్యకు కుట్ర.. అమెరికా ఆరోపణలపై ప్రధాని ఏమన్నారంటే ?
ఇదే అంశంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. 163 సంవత్సరాల తర్వాత దేశంలోని క్రిమినల్ చట్టాలను సవరించడానికి చొరవ తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలపై ఈ మార్పు ప్రభావం చూపుతుందని అన్నారు. ఫలితంగా దేశానికి పోలీసు రాజ్ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. విపక్షాలు భాష పేరుతో దేశాన్ని ఉత్తరం, దక్షిణంగా విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులపై ప్రతిపక్షాలు స్పందిస్తున్న తీరు తప్పు అని ఆయన అన్నారు.