కేంద్రం ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ (CM KCR) తో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin Owaisi), ఆల్ ఇండియా ముస్లీం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు, ముస్లిం మత పెద్దల భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. యూనిఫాం సివిల్ కోడ్‌పై సీఎం కేసీఆర్‌తో చర్చించాం. బీజేపీ యుసిసి తీసుకురావాలని చూస్తుంది. దీన్ని వ్యతిరేకించాలని కేసీఆర్ ను కోరామని అన్నారు. గతంలో అసెంబ్లీలో ఎన్ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసిందని అన్నారు. యూసిసి పై 74 పేజీలతో సీఎంకు ముస్లిం సంఘాల అభిప్రాయాలతో ప్రత్యేకంగా నోట్ అందించామని అసదుద్దీన్ తెలిపారు.
యూసిసీతో ముస్లింలకే కాదు, క్రిస్టియన్లు, తెలంగాణ గిరిజనులకు నష్టం జరుగుతుంది. యుసిసితో బీజేపీ దేశంలో కల్లోలం సృష్టించాలని చూస్తుందని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని చట్టాలపై బీజేపీ తప్పుదారి పట్టిస్తుందని, సీఆర్సీలో వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉన్నాయని అన్నారు. దేశంలో సెక్యులర్ ఇజంను బీజేపీ చంపేయాలని చూస్తుందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మోడీకి సెక్యులరిజం అంటే అలర్జీ. కేసీఆర్ యూసిసిని వ్యతిరేకిస్తామని చెప్పారు. మిగతా పార్టీల మద్దతు కూడా కోరతామని చెప్పారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఏపీ సీఎం జగన్ నుకూడా కలుస్తాం. మద్దతు కోరతాం అని అసుద్దీన్ ఓవైసీ అన్నారు.
యూసీసీకి మేం వ్యతిరేకం.. తేల్చి చెప్పిన కేసీఆర్..
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. యూసీసీ వల్ల అన్ని వర్గాల ప్రజల్లో అయోమయం నెలకొంటుందని అన్నారు. బీజేపీ దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం చేస్తోందని విమర్శించారు. భారతీయుల ఐకమత్యాన్ని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని, అందుకే యూసీసీపై కేంద్రం నిర్ణయాలను తిరస్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.