Telangana BJP: తెలంగాణలో బీజేపీ ‘బుల్డోజర్’ నడుస్తుందా ? టీఆర్ఎస్ తో ఢీకి రెడీ!!

తెలంగాణలో ఎన్నికల వేడి రాచుకుంది. వచ్చే ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ పోల్స్ కోసం పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

  • Written By:
  • Publish Date - May 15, 2022 / 01:46 PM IST

తెలంగాణలో ఎన్నికల వేడి రాచుకుంది. వచ్చే ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ పోల్స్ కోసం పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. దక్షిణాదిలో ఇప్పటికే కర్ణాటకలో పాగా వేసినా కమల దళం.. ఇప్పుడు తెలంగాణలోనూ అడుగుపెట్టాలనే కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ కు ఎంతగానో కలిసొచ్చిన ‘బుల్డోజర్’ కార్డును.. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ ప్రయోగించాలని బీజేపీ భావిస్తోంది. తద్వారా హిందూ ఓట్లను సంఘటితం చేయాలని యోచిస్తోంది.

2020 సంవత్సరంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా అద్భుత ఫలితాలను సాధించింది. గతంలో టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించిన ఎన్నో మునిసిపల్ స్థానాల్లో కమలం జెండా ఎగురవేసింది. నాటి నుంచి టీఆర్ఎస్ కు ఏకైక ప్రతిపక్షం బీజేపీయే అనే నినాదం మార్మోగడం మొదలయ్యింది. బీజేపీ నాయకులు దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభతో బీజేపీ శ్రేణులు ఎన్నికల మూడ్ లోకి వచ్చాయి.

ఇకపై ఎన్నికలు లక్ష్యంగా టీఆర్ఎస్ పై బలమైన వ్యూహాలను సిద్ధం చేసేందుకు కమలదళం కసరత్తు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, ఈటల రాజేందర్ లు కేసీఆర్ లక్ష్యంగా వాక్బానాలు సంధించడంపై, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో కేసీఆర్, కేటీఆర్ లపై విరుచుకుపడుతూ.. ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో అభివృద్ధి జరగలేదు అనే అంశంతో మజ్లిస్ పార్టీని టార్గెట్ చేసే అవకాశం ఉంది. జల ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు, కేసీఆర్ కుటుంబ పాలన, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వడంలో వైఫల్యం, నిరుద్యోగ భృతి వంటి అంశాల ద్వారా టీఆర్ఎస్ ను ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.