Arunachalam Tour Package : తమిళనాడులోని అరుణాచల పుణ్యక్షేత్రం సందర్శనకు తెలంగాణ నుంచి ఎంతోమంది భక్తులు వెళ్తుంటారు. ఆ భక్తుల కోసం తెలంగాణ టూరిజం విభాగం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం తక్కువ ఖర్చే అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా భక్తులు హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఏసీ బస్సులో ప్రయాణించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 15న అందుబాటులో ఉంది. ఈ నెలలో మిస్ అయితే.. వచ్చే నెలలోనూ వెళ్లొచ్చు. 3 రాత్రులు, 4 రోజులు సాగే ఈ టూర్లో అరుణాచలేశ్వర ఆలయంతో పాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్(Arunachalam Tour Package) అవుతాయి. టూర్ మార్గంలోని ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనం ఖర్చులను టూరిస్టులేే భరించాల్సి ఉంటుంది. టికెట్ ధరను పెద్దలకు రూ.8,000, పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు. ప్యాకేజీలోనే బస్ జర్నీ, అకామడేషన్ ఖర్చులను కవర్ చేస్తారు.
Also Read :Monkeypox : భారత్‌లో మంకీపాక్స్..రాష్ట్రాలకు కేంద్రం సూచనలు..!
హైదరాబాద్ టు అరుణాచలం టూర్ బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకంకు చేరుకుంటారు. అక్కడ దర్శనం పూర్తయ్యాక, తిరువణ్ణామలైకి బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ టూరిజం బస్సు అరుణాచలంకు చేరుకుంటుంది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆ రోజు రాత్రి అరుణాచలంలోనే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నంకల్లా వేలూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ను దర్శించుకుంటారు. శ్రీపురం నుంచి నేరుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం. మొత్తం మీద అరుణాచలం అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణ పాపాలను తొలగించేది అరుణాచలం అని అర్థం. తమిళంలో దీన్నే ‘‘తిరువన్నామలై’’ అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం.