Site icon HashtagU Telugu

Telangana Health Director: పానీ పూరి తింటున్నారా.. అయితే జర జాగ్రత్త!

Srinivas Rao

Srinivas Rao

పానీ పూరి తింటున్నారా.. అయితే జర జాగ్రత్త. తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. ఈ సమయంలో పానీపూరి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని హెల్త్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణా లో పానీపూరీ కారణంగా సుమారు 2,700 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ టైఫాయిడ్‌కు ‘పానీపూరీ డిసీజ్’ అని నామకరణం చేశామన్నారు. కామెర్లు, ప్రేగులలో మంటకు కారణమయ్యే పానీపూరీని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని సూచించారు.

పానీ పూరీని ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియలో ఎన్నో రకాల ఆటంకాలు ఏర్పడతాయి. వీటిని అతిగా తినడం వల్ల పేగుల్లో మంటకు కూడా కారణం అవుతుంది. ముఖ్యంగా వీధిలో బయట దొరికే వాటి వల్ల ఇటువంటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అందుకే చలికాలం ఇంకా వర్షాకాలంలో పానీపూరి తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వీటి వల్ల టైఫాయిడ్ మాత్రమే కాదు, శరీరంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అందుకే చాలా మంది పిల్లలకు కూడా వీటిని తినడం నిషేధం. చాలా ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు ఎక్కువ తీసుకుంటే అది ఖచ్చితంగా డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది.