Site icon HashtagU Telugu

Telangana Elections : తెలంగాణ ఇచ్చిన వారికా? తెచ్చిన వారికా? ప్రజల ఓటు ఎటు?

Are They The Ones Who Gave Telangana.. Or Are They Who Brought Telangana... For Whom Do The People Vote…

Are They The Ones Who Gave Telangana.. Or Are They Who Brought Telangana... For Whom Do The People Vote…

By: డా. ప్రసాదమూర్తి

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరే అని తేలిపోయింది. ఒకరు బీఆర్ఎస్ మరొకరు కాంగ్రెస్. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ గాని, బీఆర్ఎస్ యువ మంత్రి కేటీఆర్ గాని ఇటీవల ప్రచారంలో తమ దాడిని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీదే ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ తమకు పోటీ కాదని పైకి నాయకులు చెప్తున్నా, తరచుగా కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దండయాత్ర చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పట్ల వారు ఎంత ప్రమాదాన్ని ఊహిస్తున్నారో అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కర్ణాటక విజయం తర్వాత ఆ పథకాలను తెలంగాణ (Telangana)లో కూడా ప్రవేశపెడతామని వాగ్దానం చేయడం, అవే పథకాలకు కొంచెం అదనపు మొత్తాన్ని జోడించి అంతకు ముందు ఉన్న పథకాలను కూడా కలిపి తాము కూడా ఇస్తున్నది అవే పథకాలని బీఆర్ఎస్ మాట్లాడడం.. ఇదంతా ఒక ఎత్తు. కాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని, సోనియాగాంధీ ఆశీర్వాదంతో మాత్రమే తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆవిర్భావానికి అవకాశం ఏర్పడిందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. ఇదే అంశాన్ని వారు పదేపదే సభల్లో చెబుతున్నారు. పథకాల విషయానికొస్తే రెండు పార్టీలూ ఇస్తున్న పథకాల వాగ్దానాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. కాబట్టి ప్రజల మూడ్ ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ముడి పెట్టాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అందుకే సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోనే రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపెట్టి కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని సాగిస్తున్నారు.

We’re Now on WhatsApp. Click to Join.

గతంలో ప్రజలు ఎవరికి ఓటు వేసినా, ఇప్పుడు తెలంగాణ (Telangana) ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడానికి ప్రజలకు ఒక అవకాశం వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ప్రబలంగా ప్రజల ముందు తమ వాదన పెడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ చేస్తున్న వాదన పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కొంచెం కంగారుపడుతోంది. దానితో కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ నాయకులు దాడికి దిగారు. ఒకపక్క కేటీఆర్ మరో పక్క ఎంఐఎం, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై కాషాయం ముద్ర వేయడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. దీనికి తోడు అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వడం కాదు రాష్ట్రాన్ని దగా చేసిందని, మోసం చేసిందని పలు వాదనలు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వినిపిస్తున్నారు.

కేసిఆర్ మొన్న అశ్వరావుపేట, భద్రాచలం, పినపాక, నర్సంపేట సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలే చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అందులో తెలంగాణ (Telangana)ను కూడా కలిపేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణకు ద్రోహం చేశారని, ఆ తర్వాత కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం సాగిన ప్రతి ఉద్యమాన్నీ అణిచివేయడంలో కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరించిందని కేసీఆర్ తీవ్ర వాగ్ధాటితో దండయాత్ర చేశారు. 1969 లో సాగిన తెలంగాణ ఉద్యమంలో 400 మంది మరణానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ అని కేసిఆర్ చరిత్రలోకి వెళ్లి కాంగ్రెస్ చరిత్ర వైపు వేలెత్తి చూపించారు. ఆ తర్వాత కూడా తాము ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరుచుకోవాలని ఎంతో ఉద్యమాలు సాధించవలసి వచ్చిందని, వాగ్దానాలు చేయడమే గాని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్ర వాగ్దానాన్ని నెరవేర్చలేదని, దాని కోసమే తాను ఉద్యమం ప్రారంభించి ఆమరణ నిరాహారదీక్ష చేసి ఎందరో యువకుల ఆత్మహత్యలతో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసిఆర్ చెప్పారు.

Also Read:  BRS : ప్రచారంలో కంట్రోల్ తప్పుతున్న బిఆర్ఎస్ అభ్యర్థులు..ఓటర్లపై ఆగ్రహం

ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి కేసీఆర్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద తరచూ అభియోగాలు మోపుతూ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని ఎలా మోసం చేసిందో చెబుతూ వస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని, అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసిన టిఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించిందని, తమ నాయకులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ సముఖత చూపించకపోవడం వల్లనే తమ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాలేదని కేటీఆర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా ఎటు వెళ్లిన ఎక్కడ మాట్లాడినా ఆ సభలో తమ ప్రభుత్వం గురించి తాము చేసిన పనులు గురించి చెబుతూ మరో పక్క కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన విమర్శలతో బీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు.

ఇదంతా చూస్తుంటే చివరికి పథకాలు, వాగ్దానాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి మొదలైనవి సెకండరీగా మారిపోయి, రాష్ట్రాన్ని ఇచ్చిన వారికా.. రాష్ట్రాన్ని తెచ్చిన వారికా.. ఎవరికి ప్రజలు ఓటు వేస్తారు అనే విషయం చుట్టూ ఇప్పుడు రెండు పార్టీల నాయకులు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. చూడాలి. తెలంగాణ ప్రజలు తమకు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఒకసారి కట్టబెడతారా, లేక ఎన్నో త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించామని, రాష్ట్రాన్ని సమృద్ధితో ముందుకు సాగడానికి అహర్నిశలు తాము కష్టపడుతున్నామని చెబుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారాన్ని ఇచ్చి, కేసీఆర్ హ్యాట్రిక్ చరిత్రను నిర్మించడానికి తమ సంపూర్ణ మద్దతునిస్తారా.. అనేది మరో రెండు వారాల్లో తేలిపోతుంది.

Also Read:  YCP Samajika Sadhikara Bus Yatra : నేటి నుంచి సామాజిక సాధికార యాత్ర రెండో దశ