Umamaheswari’s Suicide: ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు ఇవేనా?

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్యకు కార‌ణం ఏమిటి?

  • Written By:
  • Updated On - August 1, 2022 / 05:58 PM IST

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్యకు కార‌ణం ఏమిటి? ఆర్థిక ఇబ్బందులా? అనారోగ్య స‌మ‌స్య‌లా? కుటుంబ వ్యవ‌హార‌మా? అనే అంశాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హత్య చేసుకున్నారు. చున్నీ మెడ‌కు క‌ట్టుకుని ఉరివేసుకున్న‌ట్టు ప్రాథ‌మికంగా పోలీసులు భావిస్తున్నారు. తొలుత హ‌ఠాన్మ‌ర‌ణంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత అనుమాన‌స్ప‌ద మృతిగా భావిస్తూ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఉస్మానియా ఆస్ప‌త్రికి ఉమామ‌హేశ్వ‌రి మృతిదేహాన్ని త‌ర‌లించి పోస్టుమార్టం నిర్వ‌హించారు.

స్వ‌ర్గీయ నంద‌మూరి తారక రామారావుకు న‌లుగురు కుమార్తెలు ఉన్నారు. మాజీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, డాక్ట‌ర్ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు భార్య పురంధ‌రేశ్వ‌రి, లోకేశ్వ‌రి, ఉమా మ‌హేశ్వ‌రి. నాలుగో కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి. ఎన్టీఆర్ బ‌తికున్న రోజుల్లో కూడా ఉమామ‌హేశ్వ‌రి దాంప‌త్య జీవితంపై ఆయ‌న ఆందోళ‌న చెందేవార‌ట‌. ఆమెకు న‌రేంద్ర రాజ‌న్ అనే వ్య‌క్తితో తొలుత వివాహం జ‌రిగింది. అత‌ను శాడిస్ట్ గా బిహేవ్ చేస్తూ సిగ‌రెట్ల‌తో కాల్చుతున్నాడని ఎన్టీఆర్ వ‌ద్ద భోరున విల‌పించేద‌ట‌. భ‌ర్త పెట్టే క‌ష్టాల‌ను తండ్రికి చెప్పుకుని బాధ ప‌డ‌డంతో రాజ‌న్ తో విడాకులు తీసుకోవ‌డానికి ఎన్టీఆర్ స‌రే అన్నార‌ట‌. ఆ త‌రువాత శ్రీనివాస ప్ర‌సాద్ అనే వ్య‌క్తికి ఇచ్చి రెండో వివాహం చేశారు.

ఉమామ‌హేశ్వ‌రి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల‌ను కొంత కాలం ఫేస్ చేసింద‌ని స‌మాచారం. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆదుకున్నాడ‌ని తెలుస్తోంది. ఆర్థికంగా కుదుట‌ప‌డిన త‌రువాత గ‌త ఏడాది కుమార్తెకు ఉమామ‌హేశ్వ‌రి వివాహం జ‌రిపారు. ఆ వివాహానికి చంద్ర‌బాబు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు హాజ‌ర‌య్యారు. వాళ్లిద్ద‌రి చాలా కాలం త‌రువాత మాట్లాడుకుంటూ ఫోటోలు దిగడం ఆ పెళ్లిలోని హైలెట్ న్యూస్ గా నిలిచింది. గ‌త ఏడాది డిసెంబర్లో వివాహం జ‌రిగింది. ఇటీవ‌ల మాన‌సికంగా ఉమామ‌హేశ్వ‌రి ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. కుమార్తెకు వివాహం చేసిన త‌రువాత ఒంట‌రిగా ఉండేవార‌ట‌. తొలి రోజుల్లో శాడిస్ట్ భ‌ర్త వ్య‌వ‌హారం, ఆ త‌రువాత ఆర్థిక ఇబ్బందులు తాజాగా ఒంట‌రిత‌నం ఫీల్ కావ‌డం వెర‌సి ఆత్మ‌హ‌త్య‌కు దారితీసింద‌ని ప్రాథ‌మికంగా పోలీసుల‌కు వ‌స్తోన్న స‌మాచారం.

ఉస్మానియా ఆస్ప‌త్రిలో పోస్టుమార్టం ముగిసిన త‌రువాత మృత‌దేహాన్ని ప్రైవేటు ఆస్ప‌త్రిలో భ‌ద్ర‌ప‌రిచే ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల్లోని బంధువులు, కుటుంబ స‌భ్యులు వ‌చ్చిన త‌రువాత అంత్య‌క్రియ‌లు చేయాల‌ని కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారని తెలుస్తోంది. బ‌హుశా మంగ‌ళం వారం లేదా బుధ‌వారం రోజున అంత్య‌క్రియ‌లు మ‌హాప్ర‌స్తానంలో ఉంటాయ‌ని స‌మాచారం. ఆమె ఆత్మ‌హ‌త్య గురించి తెలుసుకున్న వెంట‌నే చంద్ర‌బాబు, లోకేష్‌, బాల‌క్రిష్ణ‌, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఉమామ‌హేశ్వ‌రి ఇంటికి చేరుకున్నారు. ఆమె ఆత్మ‌హ‌త్యతో నంద‌మూరి ఇంట విషాదం నెల‌కొంది.