తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురుచూస్తున్న క్యాబినెట్ (Cabinet) విస్తరణకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పార్టీ ప్రధాన నాయకులతో సమావేశమవుతూ, కొత్త మంత్రుల ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో కీలకంగా చర్చించిన తర్వాత, ఈ కొత్త జాబితా ఖరారయ్యే అవకాశముంది. ఈ విస్తరణ ద్వారా పాలనలో సమర్థతను పెంచడమే కాకుండా, పార్టీలో సమతుల్యతను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Jurala Project : జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత
ఈసారి మంత్రుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, ఎన్నికల హామీలు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రెడ్డి వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎస్సీ మాల వర్గానికి చెందిన వివేక్‌లకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వీరిద్దరినీ ఎన్నికల సమయంలోనే మంత్రి హామీతో పార్టీలో చేర్చుకుంది. దీంతో ఈ ఇద్దరికి కీలక పదవులు దక్కడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో 12 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. గరిష్టంగా 18 మందికి అవకాశం ఉండటంతో 6 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను పూర్తిగా భర్తీ చేస్తారా, లేక మరికొన్ని భవిష్యత్తు కోసం ఉంచుతారా అనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు ప్రాతినిధ్యం లభించకపోవడం వల్ల, ఆ ప్రాంతాల ఎమ్మెల్యేలు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద, ఈ క్యాబినెట్ విస్తరణ ద్వారా కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశముంది.