Site icon HashtagU Telugu

IT Attacks : ఎన్నికలవేళ ఐటీ దాడులు సమంజసమేనా?

Are It Attacks Justified During Elections

Are It Attacks Justified During Elections

By: డా. ప్రసాదమూర్తి

IT Raids on Politicians : కేంద్రంలో అధికార బిజెపి రాజ్యాంగ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చి వేసిందనే విమర్శలు ఇప్పటికే దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన ఈడి (ED), ఐటి (IT), సిబిఐ (CBI) తదితర సంస్థలు కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలగుతున్నాయని, ఈ సంస్థలను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దుర్వినియోగం చేస్తుందని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు బిజెపి అధికారంలోకి వచ్చాక గత తొమ్మిదేళ్ళుగా చాలా ఎక్కువ పెరిగాయి. ఇటీవల కాలంలో చూస్తే మాత్రం ‘అయితే మోడీ లేకుంటే ఈడీ..’ ఇలాంటి నినాదాలు కూడా ఎక్కువయ్యాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆయా సంస్థలు స్వతంత్రంగా తమ పరిధిలో తాము పని చేసుకుంటూ పోతున్నాయని బిజెపి నాయకులు అంటారు. కానీ జరుగుతున్న వాస్తవాలను చూస్తే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో అర్థం లేకపోలేదని తెలుస్తుంది. అసలే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మామూలు సమయంలో ఐ.టి,ఈడి దాడులు ఎవరిమీద జరిగినా పెద్దగా వార్తల్లోకి రాకపోవచ్చు. కానీ ఎన్నికల సమయంలో ఈ దాడులు పెరిగితే వాటి అంతరార్థం పట్ల అందరికీ అనుమానాలు రావడం సహజమే.

We’re now on WhatsApp. Click to Join.

బిజెపి అధికారంలోకి వచ్చాక తమ ప్రత్యర్థి పార్టీల నాయకుల మీదనే ఎక్కువగా ఈ సంస్థలను ఉపయోగించినట్టు ఇటీవల అనేక సర్వేలలో కూడా తెలిసింది. తమ పట్ల వ్యతిరేకత ప్రదర్శించే వారి నోరు మూయించడానికి, తమకు వ్యతిరేకంగా వారు ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండా మౌనం వహించడానికి ఈ సంస్థలను బిజెపి అస్త్రాలుగా ప్రయోగిస్తుందని ఇటీవల కాలంలో అనేక ఉదాహరణల ద్వారా ప్రతిపక్ష నాయకులు చూపిస్తున్నారు. గుజరాత్ అల్లర్ల మీద డాక్యుమెంటరీ చేసిన బిబిసి ఆఫీసులపై ఐటి దాడులు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే న్యూస్ క్లిక్ లాంటి సోషల్ మీడియా సంస్థల మీద సిబిఐ ని ప్రయోగించిన ఉదంతాన్ని కూడా మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకపక్క ఎన్నిక జరుగుతూ ఉండగా ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి మీద ఈడి అధికారులు దాడులు చేసిన తాజా ఉదాహరణ కూడా ఉంది. ఇలా రాజకీయంగా తమ ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడానికి బిజెపి ఈ సంస్థలను వినియోగిస్తుందని తాజా పరిణామాలు ద్వారా మనకు అర్థమవుతుంది.

తెలంగాణలో ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయాల మీద, ఇళ్ళమీద ఐటీ అధికారులు (IT Officers) దాడులు జరిపారు. ఇది సరిగ్గా శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేసే రోజున ఈ దాడులు కొనసాగడం కాంగ్రెస్ వర్గాలలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈడీ (ED) గాని ఐటీ (IT) గాని సిబిఐ (CBI) గాని మరే రాజ్యాంగ సంస్థ గాని తగిన ఆధారాలతో దాడులు చేయడం రాజ్యాంగ సమ్మతమే. కానీ ఎవరి మీద ఏ సమయంలో ఈ దాడులు చేస్తున్నారు అనేదే ఇక్కడ కీలకం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అధికార బిఆర్ఎస్ నుండి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఒకవేళ ఆయనపై చట్టపరమైన రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలంటే ఇప్పటివరకు ఐటీ శాఖ ఏం చేసింది? అనే విషయం చర్చకు వస్తుంది. సాధారణంగా బిజెపి తన శత్రుపక్షాల మీదే ఈ సంస్థలను ప్రయోగిస్తుంది. మిత్ర పక్షాలు పట్ల ఉదాసీనత వహిస్తుంది. మిత్రపక్షాల్లో నాయకులు, వారి కుటుంబ వ్యక్తులు ఏ నేరాలు చేసినా, ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా పై సంస్థలను ప్రయోగిస్తామని బెదిరించడమే తప్ప ఎక్కడా అలా ప్రయోగించిన దాఖలాలు కనబడవు. ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీలలోని నాయకులను బెదిరించి తమ వైపు తిప్పుకోవడానికి కూడా ఈ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి.

Also Read:  War Pause : గాజాపై దాడులకు రోజూ 4 గంటల ‘పాజ్’.. ఇజ్రాయెల్ ప్రకటన

మహారాష్ట్రలో ఎన్సీపీ విషయంలో ఇదే జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ విషయంలో ఇదే జరిగింది. ఇలా అనేక చోట్ల అయితే ఈడీ లేదా ఐటీ (IT) కాకుంటే సిబిఐ.. ఈ సంస్థలు కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకుల ఆదేశాల మేరకు రంగంలోకి దూకుతాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బిజెపికి ఎలాంటి ప్రత్యక్ష వైరం లేకపోయినప్పటికీ సరిగ్గా ఎన్నికల సమయంలో ఆయన నామినేషన్ వేసే రోజునే ఆయన కార్యాలయాల మీద ఈటి శాఖ దాడులు చేయడం చాలా సందేహాలకు దారితీస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఇది బిఆర్ఎస్, బిజెపి కలిసి చేసిన కుట్ర అని విమర్శ చేశారు. బయటకు బిజెపి, బీఆర్ఎస్ ఒకరినొకరు ఎన్ని తిట్టుకున్నా పరోక్షంగా ఆ రెండు పార్టీల మధ్య బంధం ఉందని ఇన్నాళ్లుగా వినిపిస్తున్న ఆరోపణలకు పొంగులేటి మీద తాజా ఐటీ దాడి ఉదాహరణగా నిలుస్తుంది. అంతేకాదు లిక్కర్ స్కాం లో ఎన్నాళ్ళ నుంచో కవితను అరెస్టు చేస్తామని బిజెపి నాయకులు బెదిరిస్తూ వచ్చారు. కానీ ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు. ఇది కూడా కాంగ్రెస్ చేస్తున్న విమర్శకు బలాన్ని చేకూర్చేది గానే ఉంది.

ఏది ఏమైనా ఎన్నికల సమయంలో ఒక నాయకుడిని ఈ విధంగా ఇబ్బంది పెట్టి అతన్ని అపఖ్యాతిపాలు చేసి, తద్వారా లబ్ధి పొందాలని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని వినిపిస్తున్న విమర్శలకు ఈ తాజా ఐటీ దాడులు (IT Attacks) ఊతమిస్తున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? ఎంతవరకు నైతికం? అనే విషయాలు సామాన్య పౌరులు కూడా ప్రశ్నించే అంశాలుగా మారిపోవడం మన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనం చూస్తున్న అత్యంత శోచనీయమైన సందర్భం.

Also Read:  Telangana : తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో అత్యంత సంప‌న్న అభ్య‌ర్థి ఆయ‌నే..!