Information Commissioners: రాష్ట్ర సమాచార కమిషనర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించనుంది. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) , ఏడుగురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించేందుకు సర్కారు సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలతో ఫైలును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్దకు సర్కారు పంపింది. గవర్నర్ నుంచి ఆమోదం లభించగానే ప్రభుత్వం ఈ నియామకాలపై అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. సీఐసీగా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని(Information Commissioners) ఎంపిక చేశారు. ఇక ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా జర్నలిస్టు పీవీ శ్రీనివాస రావు, అయోధ్య రెడ్డి బోరెడ్డి, కప్పర హరిప్రసాద్, పీఎల్ఎన్ ప్రసాద్ గౌడ్, రాములు, వైష్ణవి, పర్వీన్ మొహిసిన్‌లకు అవకాశం కల్పించనున్నారు. ఏడుగురు కమిషనర్లలో ముగ్గురు జర్నలిస్టులే ఉండటం గమనార్హం. దీనిపై ఇవాళే ఉత్తర్వులు జారీ కానున్నాయి. 2023 ఫిబ్రవరి నుంచి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలుకు సంబంధించిన కమిషనర్ల నియామకం జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత ఎట్టకేలకు ఈ దిశగా అడుగులు పడ్డాయి.
Also Read :Parshuram Jayanti : గురువు శివుడు.. శిష్యుడు ద్రోణాచార్యుడు.. పరశురామ ది గ్రేట్
నియామకం ఇలా..
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 15(1) కింద రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటవుతుంది. ఇందులో ఓ ప్రధాన కమిషనర్‌తోపాటు గరిష్టంగా 10 మంది కమిషనర్లను నియమించొచ్చు. సీఎం ఛైర్ పర్సన్‌గా శాసనసభలో ప్రతిపక్ష నేత, ఓ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉండే కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ వీరిని నియమిస్తారు. సమాచార కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది.
మనం సంప్రదించడం ఎలా ?
తెలంగాణ సమాచార కమిషన్, సమాచార హక్కు భవన్, డోర్ నంబర్ 5–4–399, మొజంజాహి మార్కెట్ పక్కన, హైదరాబాద్–500001 చిరునామాలో మనం సంప్రదించొచ్చు. ఫోన్ నంబరు 040–24720240 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉంటుంది.
సమాచార కమిషన్‌కు అప్పీల్ ఎలా ?
- ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇచ్చేందుకు అధికారి నిరాకరిస్తే మనం రాష్ట్ర సమాచార కమిషన్‌కు అప్పీల్ చేయొచ్చు.
- నిర్దేశించిన 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వకపోయినా మనం అప్పీల్ చేయొచ్చు.
- సమాచారం కోసం చెల్లించాల్సిన రుసుము సహేతుకంగా లేదని అనిపిస్తే.. ఒకవేళ అధికారి తప్పుడు సమాచారం ఇచ్చినా నేరుగా రాష్ట్ర సమాచార కమిషన్‌లో అప్పీల్ దాఖలు చేయొచ్చు.