AP & TS Likely Sri Lanka: ఏపీ, తెలంగాణాల్లో శ్రీలంక `బూచి`

ఏపీ మ‌రో శ్రీలంక అంటూ ఇటీవ‌ల బాగా ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య చాలా బ‌లంగా వెళ్లింది.

  • Written By:
  • Updated On - August 1, 2022 / 05:20 PM IST

ఏపీ మ‌రో శ్రీలంక అంటూ ఇటీవ‌ల బాగా ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య చాలా బ‌లంగా వెళ్లింది. మ‌రో ఆరు నెల‌ల్లో ఏపీ రాష్ట్రం శ్రీలంక కాబోతుంద‌ని తాజాగా ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ డెడ్ లైన్ పెట్టారు. ఆయ‌న `జ‌గ‌న్ పోవాలి పాల్ రావాలి` అనే టాగ్ తో ఏపీ వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఆ సంద‌ర్భంగా శ్రీలంక‌తో పోల్చుతూ ఏపీని భ‌విష్య‌త్ ను ఆవిష్క‌రించారు. నిజంగా ఏపీ ప‌రిస్థితి ఆ విధంగా ఉందా? అప్పుల్లో మునిగి పోయిందా? అంటే అందులో నిజంలేద‌ని కేంద్రం చెబుతోంది. ఏపీ కంటే దారుణ‌మైన ఆర్థిక క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రాల జాబితాలో త‌మిళ‌నాడు, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు శ్రీలంక దేశం మాదిరిగా మార‌కుండా ఏపీ మాత్ర‌మే ఎందుకు మారుతుంద‌ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తారు.

వాస్త‌వంగా తమిళనాడు 6 లక్షల 59వేల 868 కోట్ల అప్పుతో నెంబ‌ర్ 1 ప్లేస్ లో ఉంది. రెండో ప్లేస్ లో 6 లక్షల 53 వేల కోట్లతో ఉత్తరప్రదేశ్ ఉంది. మహారాష్ట్ర 6 లక్షల 8 వేల కోట్ల అప్పుతో మూడో స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 5 లక్షల 62 వేల కోట్లతో నాలుగో స్థానం, కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలకు కూడా 4 లక్షల కోట్ల దాకా అప్పు ఉంది. ఆ విష‌యాన్ని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ రాత‌పూర్వ‌క నివేదిక ఇచ్చారు. అంటే, దేశంలోని చాలా రాష్ట్రాల‌తో పోల్చుకుంటే ఏపీ మెరుగ్గా ఉంది. పైగా ప‌క్క‌నే ఉన్న త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్ట్రం కంటే భేషుగ్గా ఉంది. ఒక ర‌కంగా చెప్పాలంటే, తెలంగాణ కంటే కూడా ఏపీ ఆర్థికంగా ఎంతోకంత బెట‌ర్ గా క‌నిపిస్తోంది. వాస్త‌వాలు ఇలా ఉండ‌గా శ్రీలంక‌తో ఏపీని పోల్చుతూ బ్రాండ్ ఇమేజ్ ను విప‌క్ష లీడ‌ర్లు డామేజ్ చేస్తున్నార‌ని వైసీపీ చెబుతోంది.  ఏపీలో అప్పుల విషయానికి వస్తే, 2020 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,07,671 కోట్లుగా కాగా 2021 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,60,333 కోట్లుగా తేలింది. 2022 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు రూ.3,98,903 కోట్లకు చేరాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాష్ట్రాల అప్పుల వివరాల గురించి లోక్ సభ సభ్యుడు కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇక‌ తెలంగాణ రాష్ట్రాన్ని 8 ఏళ్లలో 3లక్షల 12వేల కోట్ల రూపాయల అప్పుకు తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో తెలంగాణలో ప్రతి వ్యక్తిపై లక్ష రూపాయల రుణభారం ఉంద‌ని కాంగ్రెస్ చెబుతోంది. తెలంగాణ మ‌రో శ్రీలంక అంటూ ఉత్తమ్ అంటుఉన్నారు.

ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పు రూ. 3,12,191.3 కోట్లు ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాలను రాతపూర్వకంగా ఆర్ధిక శాఖ విడుద‌ల చేసిన త‌రువాత తెలుగు రాష్ట్రాలు శ్రీలంక‌గా మార‌తున్నాయ‌ని చేసిన ప్ర‌చారానికి కొంత మేర‌కు బ్రేక్ ప‌డింది. కానీ, కేఏ పాల్ మాత్రం ఆరు నెల‌లు డెడ్ లైన్ పెడుతూ ఏపీ మ‌రో శ్రీలంక‌గా మార‌బోతుంద‌ని జోస్యం చెబుతున్నారు. వాస్త‌వాల‌కు భిన్నంగా విప‌క్షాలు చేస్తోన్న ప్ర‌చారం రాష్ట్రాల అభివృద్ధిని ప్ర‌శ్నించేలా ఉండ‌డం గ‌మ‌నార్హం. భార‌త దేశం ఆర్థిక ప‌రిస్థితి తెలుగు రాష్ట్రాల కంటే ఘోరంగా ఉంద‌ని వైసీపీ చెబుతోంది. ఇండియా చేసిన అప్పుల కంటే ఏపీ చేసిన అప్పులు చాలా త‌క్కువ‌ని లెక్క‌లు తీస్తోంది. మొత్తం మీద `శ్రీలంక‌గా మారితే భార‌త్ మారాలి. తెలుగు రాష్ట్రాలు మాత్ర‌మే శ్రీలంక మాదిరిగా మార‌తాయ‌న‌డంలో నిజంలేదు.` ఆ విష‌యాన్ని ఆర్థిక నిపుణులు, అధికార‌ప‌క్షం చెబుతోంది.