Domestic Tourist: ఆ జాబితాలో ఏపీ 3వ స్థానంలో.. తెలంగాణ 6వ స్థానంలో..!

2021లో దేశీయ పర్యాటక సందర్శనల (DTV) పరంగా ఆంధ్రప్రదేశ్‌ 3వ స్థానంలో, తెలంగాణ 6వ స్థానంలో ఉందని కేంద్రం పేర్కొంది.

  • Written By:
  • Updated On - December 6, 2022 / 10:00 AM IST

2021లో దేశీయ పర్యాటక సందర్శనల (DTV) పరంగా ఆంధ్రప్రదేశ్‌ 3వ స్థానంలో, తెలంగాణ 6వ స్థానంలో ఉందని కేంద్రం పేర్కొంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్-2022.. 63వ ఎడిషన్ ప్రకారం AP 9.32 కోట్ల మంది దేశీయ పర్యాటకులను ఆకర్షించింది. ఇది దేశవ్యాప్తంగా 13.8 శాతం. తెలంగాణకు 2 కోట్ల డీటీవీలు లేదా జాతీయ మొత్తంలో 4.7 శాతం వచ్చాయి.

11.53 కోట్ల దేశీయ పర్యాటక సందర్శనలతో (17.02 శాతం) తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ 10.97 కోట్లతో (16.19 శాతం) రెండో స్థానంలో ఉంది. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం DVT నివేదిక ప్రకారం.. 67.76 కోట్లు, 11.05 శాతం వృద్ధిని నమోదు చేసింది. హోటళ్లు, ఇతర వసతి సంస్థల నుండి సేకరించిన నెలవారీ రిటర్న్‌ల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి అందుకున్న సమాచారం నుండి ఈ డేటా సంకలనం చేయబడింది.

TS టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSTDC)లోని ఒక సీనియర్ అధికారి రామప్ప ఆలయానికి మెరుగైన మౌలిక సదుపాయాలు, యునెస్కో గుర్తింపు వంటి కారణాల వల్ల 6వ ర్యాంకింగ్‌కు కారణమని తెలిపారు. అధికారి మాట్లాడుతూ.. మెరుగైన రోడ్డు కనెక్టివిటీ, మంచి సౌకర్యాలతో వసతి కల్పించడం ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది. అంతేకాదు ఇటీవల ములుగులోని రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు, నగరానికి లభించిన తాజా అవార్డులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మంచి సౌకర్యాలతో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసింది. పర్యాటకులకు కార్పొరేషన్ యాజమాన్యంలోని హరిత గ్రూప్ హోటళ్లలో సరసమైన ధరలకు వసతి లభిస్తుంది. ఏపీకి వచ్చే దేశీయ పర్యాటకుల్లో ఎక్కువ మంది తిరుపతి, విజయవాడ, శ్రీశైలం తదితర ప్రాంతాల్లోని దేవాలయాలను సందర్శిస్తుండగా, విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారని ఏపీటీడీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్‌ ఆంక్షల కారణంగా దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకుల సంఖ్య 2021లో గణనీయంగా తగ్గిపోయినట్లు పర్యాటక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం విదేశీ పర్యాటకుల సంఖ్య 7.17 మిలియన్లు ఉండగా 2021లో 1.05 మిలియన్లకు తగ్గిపోయింది. 2020తో పోల్చి చూస్తే 2021లో దేశం మొత్తం మీద విదేశీ పర్యాటకుల సంఖ్య 85.29 శాతం క్షీణించింది.