Davos Challenge : సోద‌రుల‌కు `దావోస్` ఛాలెంజ్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్ , తెలంగాణ మంత్రి కేటీఆర్ స‌త్తా ఏమిటో ఈసారి జ‌రిగే దావోస్ వేదిక తేల్చ‌బోతుంది.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 04:44 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ , తెలంగాణ మంత్రి కేటీఆర్ స‌త్తా ఏమిటో ఈసారి జ‌రిగే దావోస్ వేదిక తేల్చ‌బోతుంది. ఇద్ద‌రూ పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు దావోస్ లో జ‌రిగే సద‌స్సుపై గురిపెట్టారు. ఇప్ప‌టికే పారిశ్రామిక ప్ర‌గ‌తిని ప‌రుగెత్తిస్తోన్న తెలంగాణకు ధీటుగా ఏపీని నిల‌ప‌డానికి తొలిసారిగా సీఎం అయిన త‌రువాత జ‌గ‌న్ దావోస్ వెళుతున్నారు. ఏపీ అభివృద్ధి చ‌తికిల‌ప‌డింద‌ని విప‌క్షాలు చేస్తోన్న జ‌గ‌న్ పై చేస్తోన్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అంతేకాదు, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌లేక‌పోతున్నార‌ని అప‌వాదు ఉంది. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న వ‌చ్చిన త‌రువాత తెలంగాణ అభివృద్ధి వేగం పుంజుకుంద‌ని టీఆర్ఎస్ నేత‌లు ఇటీవ‌ల ప‌లు వేదిక‌లపై చెప్ప‌డం విన్నాం. ఇలాంటి ప‌రిస్థితుల్లో స్విడ్జ‌ర్లాండ్ లోని దావోస్ వేదిక‌గా జ‌రిగే పారిశ్రామిక సద‌స్సుకు ఈసారి తెలుగు రాష్ట్రాలు కేంద్ర బిందువుగా మార‌నున్నాయి.

దావోస్ ప‌ర్య‌ట‌న కోసం ఇప్ప‌టికే మంత్రి కేటీఆర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఐటి శాఖ మంత్రి కెటి రామారావు మంగళవారం యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించే వరుస సమావేశాలకు ఆయన హాజరవుతారు. ఆ తర్వాత, మే 22 నుండి 26 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ పాల్గొన‌డానికి దావోస్ వెళ‌తారు. మే 22 నుంచి 26వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అనేక సమావేశాలు జరుగుతాయి. మున్ముందు తీవ్రమైన కార్యకలాపాలు జరుగుతాయి” అని కేటీఆర్ ట్వీట్ చేసి తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న పోటీని ప‌రోక్షంగా ర‌క్తిక‌ట్టించారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఈ ఆహ్వానాన్ని ఒక గుర్తింపుగా భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. గ్లోబల్ కంపెనీలు స్టాట్‌లో పెట్టుబడులు పెట్టడానికి అపారమైన అవకాశాలను కేటీఆర్ పేర్కొన్నారు. 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతుల ఆధ్వర్యంలో మే 22 నుంచి 26 వరకూ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ను ఆక‌ట్టుకునేందుకు స‌ర్వం సిద్ధం చేసుకుని లండ‌న్ ఫ్లైట్ ఎక్కారు మంత్రి కేటీఆర్. ఈ నెల 19వ తేదీ నుంచి 31వరకు విదేశీ పర్యటనకు వెళ్ల‌డానికి సీబీఐ ప్ర‌త్యేక కోర్టు జ‌గ‌న్ కు అనుమ‌తి ఇచ్చింది. దీంతో సీఎం జ‌గ‌న్ దావోస్ ప‌ర్య‌ట‌న కోసం ఈనెల 20వ తేదీన వెళ్ల‌నున్నార‌ని తెలిసింది.

ప్రధానంగా 3 కీలక సమావేశాలలో జ‌గ‌న్ భాగస్వామ్యం కానున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న 23న తేదీన వైద్యరంగం, 24వ తేదీన విద్య, నైపుణ్య రంగాలపై జ‌రిగే అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్లొనున్నారు. 24వ తేదీన డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్ తొలిసారి అధికారికంగా దావోస్ వెళ్లనున్నారు. ఈనెల 22 నుంచి 26వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు జగన్ టీమ్ హాజరుకానుంది. సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కి పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జ‌రిగేలా షెడ్యూల్ చేశారు.

రాష్ట్రాల విడిపోయిన త‌రువాత 2014 నుంచి 2019 వ‌ర‌కు ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకురావ‌డానికి తీవ్రంగా పోటీప‌డ్డాయి. ఒకొనొక స‌మ‌యంలో చంద్ర‌బాబు కంపెనీల‌ను హైజాక్ చేస్తున్నార‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆరోపించింది. అంతేకాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫార్ములాను ఏపీ ప్ర‌భుత్వం దొంగిలించింద‌ని ఆనాడు సీఎం కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు. కియాతో స‌హా ప‌లు కంపెనీల‌ను తెలంగాణ‌కు కాద‌ని ఏపీకి వ‌చ్చే లా చంద్ర‌బాబు చేయ‌గ‌లిగారు. ఆ విష‌యాన్ని టీడీపీ ఇప్ప‌టికీ గుర్తు చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత కంపెనీలు రావ‌డంలేద‌ని, ఉన్న‌వి త‌ర‌లిపోతున్నాయ‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దావోస్ స‌ద‌స్సుకు ఉన్న‌తాధికారులు, మంత్రుల‌తో కూడిన బృందాన్ని తీసుకెళుతున్నారు. అన్ని హంగులున్న తెలంగాణ ఒక వైపు రాజ‌ధాని లేకుండా ఉన్న ఏపీ ఇంకో వైపు దావోస్ వేదిక‌గా ఎలా పోటీప‌డ‌తాయో ఆస‌క్తిగా మారింది.

వాస్త‌వంగా వ‌న‌రుల విష‌యంలో ఏపీ, తెలంగాణ‌కు వేర్వేరుగా ఉంటాయి. కోస్తాతీరం ఏపీకి కొంగు బంగారంగా ఉంది. అంతేకాదు, ఆక్వాతో పాటు వాణిజ్య పంట‌ల‌కు నెలవు ఆ రాష్ట్రం. ఓడ‌రేవుల ద్వారా భారీ ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌కు అవ‌కాశం ఉంది. ఇక తెలంగాణ‌కు వాతావ‌ర‌ణం, మౌలిక వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎలా త‌మ చాతుర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తారో..ఆస‌క్తిక‌రం. ఈ సద‌స్సు ఇద్ద‌రికీ ఒక ఛాలెంజ్!